ఏడాది కాలంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ఎన్నో విజయాలను సాధించిందని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఉద్ఘాటించారు. మోదీ 2.0 ప్రభుత్వం పగ్గాలు చేపట్టి ఏడాది గడిచిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కాలంలో ఎన్నో అనుకోని సవాళ్లను ఎదుర్కొన్నామని, అయినా సమర్థంగా పాలన సాగించామని పేర్కొన్నారు.
కరోనా కష్టకాలంలో ప్రధాని మోదీ ముందుండి నడిపించారని నడ్డా అన్నారు. సరైన సమయానికి కఠిన నిర్ణయాలు తీసుకుని మహమ్మారిపై యుద్ధం సాగించారని కొనియాడారు. కరోనాపై పోరులో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు మోదీ కృషి చేశారని చెప్పారు.
"అగ్రరాజ్యాలు కూడా కరోనా విషయంలో చేతులెత్తేశాయి. కానీ భారత్లో ఇంకా పరిస్థితి అదుపులోనే ఉంది. కేంద్రం సరైన సమయంలో లాక్డౌన్ విధించి వ్యాధి సంక్రమణను నిలువరించగలిగింది. కానీ ఈ విషయంలో భాజపా ప్రభుత్వం ఎన్నడూ రాజకీయం చేయలేదు. కాంగ్రెస్ మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. దురదృష్టవశాత్తూ ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారి తీశాయి."
- జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు