జమ్ముకశ్మీర్‌లో.. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేయాలనే ధోరణిలో ముందుకెళ్తోంది కేంద్రం. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఇక్కడ వరుసగా వేర్పాటువాద సంస్థలపై నిషేధం విధిస్తూ వస్తోంది. తాజాగా యాసిన్ మాలిక్ నేతృత్వంలోని జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్)పై నిషేధం విధించింది కేంద్రం. జమ్ములో పరిస్థితిపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. వేర్పాటు వాద సంస్థలపై కేంద్రం ఉక్కుపాదం "యాసిన్ నేతృత్వంలోని జేకేఎల్ఎఫ్ను కేంద్ర ప్రభుత్వం నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం-1967 సెక్షన్ 31 ప్రకారం చర్యలకు ఉపక్రమించింది. ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపాలన్న విధానంతో కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశ సమగ్రతకు హాని తలపెట్టే వేర్పాటు వాద సంస్థలను అణచివేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ సంస్థలకు వ్యతిరేకంగా ఎన్ఐఏ, ఈడీ సంస్థలు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి."
-రాజీవ్ గాబా, హోంశాఖ కార్యదర్శి
ఉగ్రవాద సంస్థలతో జేకేఎల్ఎఫ్కు దగ్గర సంబంధాలు ఉన్నాయని, జమ్ములో తీవ్రవాదులకు మద్దతిస్తున్నారని కేంద్రానికి అధికారులు తెలిపారు.
జైలులో యాసిన్
సంస్థ అధిపతి యాసిన్ మాలిక్ జమ్ములోని కోట్ బిల్వాల్ జైలులో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి ముఫ్తీ మహ్మద్ కూతురు రుబయ సయీద్ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కశ్మీరీ పండిట్ల వలసలు
జమ్ములో జరిగే వేర్పాటువాద కార్యకలాపాల్లో జేకేఎల్ఎఫ్ ముందుస్థానంలో ఉంటుంది. 1989లో జరిగిన కశ్మీరీ పండిట్ హత్యల్లో సైతం వీరి పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. దురాగతాలతో కశ్మీర్ నుంచి భారీ సంఖ్యలో పండిట్లు వలస వెళ్లారు. 1984లో జరిగిన భారత దౌత్యవేత్త రవీంద్ర మాత్రే హత్యతోనూ సంస్థకు సంబంధాలు ఉన్నాయి.
1970లో ప్రారంభం
బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో పాకిస్థానీ జాతీయుడు అమానుల్లా ఖాన్ 1970లో జేకేఎల్ఎఫ్ను స్థాపించారు. 1971లో శ్రీనగర్ నుంచి జమ్మూకు వెళ్లే విమానాలను హైజాక్ చేసి వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు 37 కేసులు నమోదయ్యాయి.