కాంగ్రెస్‌కు జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేయడాన్ని ఆయన అత్తలు వసుంధర రాజే, యశోధర రాజే స్వాగతించారు. ఆయన సొంత ఇంటికి తిరిగి వస్తున్నారని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే వ్యాఖ్యానించారు.
"నాకు చాలా ఆనందంగా ఉంది. సింధియాకు శుభాకాంక్షలు. ఇది ఆయన ఇంటికి తిరిగి రావడమే. మాధవరావు సింధియా తన రాజకీయ ప్రయాణాన్ని జన్ సంఘ్ నుంచే మొదలు పెట్టారు. జ్యోతిరాదిత్య సింధియాను కాంగ్రెస్ పట్టించుకోలేదు."
- వసుంధర రాజే, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి
సింధియా మరో అత్తయ్య అయిన భాజపా ఎమ్మెల్యే యశోధర రాజే ఆయన నిర్ణయాన్ని ప్రశంసించారు. దేశ ప్రయోజనాల కోసమే రాజమాత రక్తమైన సింధియా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు.
కాంగ్రెస్ విమర్శలు
సింధియా పార్టీకి రాజీనామా చేయడాన్ని కాంగ్రెస్ మోసపూరిత చర్యగా అభివర్ణించింది. ప్రజల విశ్వాసాన్ని, పార్టీ సిద్ధాంతాల్ని సింధియా తుంగలో తొక్కారని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ఆరోపించారు.
"సింధియా లాంటి వ్యక్తులు అధికారం లేకపోతే ఉండలేరు. ఎప్పుడు అవకాశం వస్తుందా అని వేచి చూస్తారు. జాతీయ సంక్షోభం నెలకొన్న ఈ సమయంలో సింధియా... భాజపాలో చేరుతున్నారంటేనే ఆయన అధికార దాహాన్ని అర్థం చేసుకోవచ్చు."