ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కర్ణాటక జానపద 'యక్షగానం' కళను.. పురుషాధిక్య కళగా పేర్కొంటారు చాలామంది. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న ఈ రోజుల్లోనూ.. యక్షగానంలో మాత్రం వారి సంఖ్య వేళ్లపై లెక్కపెట్టొచ్చు. అలాంటిది.. తొలిసారిగా ఓ ముస్లిం యువతి తన యక్షగాన ప్రదర్శనతో అబ్బురపరుస్తోంది.
దక్షిణ కర్ణాటక, ఒక్కెతూర్ మాడ గ్రామానికి చెందిన అర్షియా(20).. ముస్లిం కుటుంబంలో పుట్టిపెరిగింది. అయితేనేం, తానూ భారతమాత బిడ్డనే అంటోంది. మతబేధం మచ్చుకైనా లేకుండా, హిందూ ఇతిహాసలను ప్రదర్శించే జానపద కళ 'యక్షగాన' పట్ల ఇష్టం పెంచుకుంది. 10 ఏళ్ల వయసులో తన గ్రామంలో యక్షగాన ప్రసంగం చూసింది అర్షియా.. అప్పటి నుంచి ఏదో ఓ రోజు వేదికపై తానూ యక్షగాన ప్రదర్శనలివ్వాలని నిర్ణయించుకుంది.
"నా బాల్యంలో మహిషాసురుడి పాత్ర యక్షగాన ప్రదర్శన చూశాను. అప్పటి నుంచే యక్షగానం అంటే ఎనలేని ఇష్టం పెరిగింది. ఎక్కడ ప్రదర్శన ఉన్నా చూస్తూ ఉండిపోయేదాన్ని. టీవీ, సీరియళ్లలో యక్షగాన కార్యక్రమాలు తప్పకుండా చూసేదాన్ని. అయితే, ఇందులో మతానికి సంబధం లేదు. ఇది కేవలం భారతీయ సంస్కృతికి సంబంధించినది మాత్రమే. అందుకే నేను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నా. "