11న భారత్‌కు జిన్‌పింగ్- డ్రాగన్‌తో మైత్రి దృఢమయ్యేనా? చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించనున్నారు. చెన్నై సమీపంలోని చారిత్రక పట్టణం మామల్లపురంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో అనధికారిక సమావేశంలో జిన్‌పింగ్ పాల్గొంటారు.
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరస్పర సహకారం పెంపుపై చర్చించనున్నారు మోదీ, జిన్‌పింగ్.
కశ్మీర్ అంశంపై..
కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జిన్‌పింగ్ భారత పర్యటన చర్చనీయాంశమైంది. ప్రస్తుతం పాక్ ప్రధాని చైనా పర్యటనలో ఉన్నారు. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇమ్రాన్-జిన్‌పింగ్ భేటీ జరిగిన కొద్దిరోజులకే మోదీ-జిన్‌పింగ్ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే... జిన్‌పింగ్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తేనే ప్రధాని భారత దేశ వైఖరిని స్పష్టంగా వివరిస్తారని చెప్పాయి అధికారిక వర్గాలు.
వాణిజ్యం..
ఉగ్రవాదంపై పోరు, వాణిజ్య బంధం బలోపేతం కోసం రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై మోదీ-జిన్‌పింగ్ ప్రధానంగా చర్చించనుంది. భారత్‌తో వాణిజ్యం లోటుపై డ్రాగన్ రాయబారి వ్యాఖ్యల నేపథ్యంలో జిన్‌పింగ్ ఎలాంటి వైఖరి అనుసరిస్తారన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సరిహద్దుపై..
3,488 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దును భారత్-చైనా పంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అగ్రనేతల భేటీలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సరిహద్దు వద్ద శాంతి కొనసాగింపుపై ఇరువురు నేతలు సమాలోచనలు జరిపే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సరిహద్దు విషయంలో ఉన్న భేదాభిప్రాయాల పరిష్కారం దిశగా ఈ భేటీ జరగనుందని సమాచారం.
ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు..
ఉగ్రవాదంపై పోరులో పరస్పర సహకారం అవసరమని ఈ సమావేశంలో మోదీ స్పష్టం చేయనున్నారని తెలుస్తోంది. పుల్వామా దాడి వేళ యావత్ ప్రపంచం భారత్‌కు బాసటగా నిలుస్తుంటే చైనా అందుకు భిన్న వైఖరి అవలంబించింది. దాడి సూత్రధారి మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న పలు దేశాల ప్రతిపాదనలను ఐక్యరాజ్యసమితిలో వ్యతిరేకించింది.
ఇదీ చూడండి: కశ్మీర్ పరిస్థితిపై ఐరాస 'సానుకూల' ప్రకటన!