భారతీయ చారిత్రక సంపద సందర్శనతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తొలిరోజు పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు జిన్‌పింగ్. ఆయనకు తమిళనాడు గవర్నర్ పురోహిత్, సీఎం పళనిస్వామి ఘనస్వాగతం పలికారు. తమిళనాడు వారసత్వ కళలు, సాంస్కృతిక కార్యక్రమాలతో డ్రాగన్ అధ్యక్షుడిని ఆహ్వానించారు.
రోడ్డు వెంట జనం..
ఐటీసీ చోళ హోటల్లో కాసేపు సేదతీరిన అనంతరం.. మహాబలిపురానికి బయల్దేరారు చైనా అధ్యక్షుడు. ఆయన ప్రయాణించే మార్గం ఈస్ట్ కోస్ట్ రోడ్డు వెంబడి జనం భారీగా చేరారు. సంప్రదాయ నృత్యాలతో ఆహ్వానం పలికారు.
పంచెకట్టుతో మోదీ స్వాగతం..
జిన్‌పింగ్‌కు స్వాగతం పలికేందుకు.. మహాబలిపురానికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పంచెకట్టులో డ్రాగన్ అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికారు. ఇరువురు నేతలు అక్కడి చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. మొదటగా ఏడో శతాబ్దంలో నిర్మించిన అర్జున పెనాన్స్.. తర్వాత పంచ రథాలను సందర్శించారు. చారిత్రక ప్రదేశాల ప్రాశస్త్యాన్ని జిన్‌పింగ్‌కు వివరిస్తూ కనిపించారు మోదీ.