సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్యలో దాదాపు 5,000 ఆలయాలున్నాయి. తెల్లవారుజామునుంచే శ్రీరామ భక్తుల సందడి మొదలవుతుంటుంది. ఇక్కడి మందిరాల్లో అనేక విశిష్టతలుంటాయి. వీటిలో దక్షిణ భారత సంప్రదాయ విధానంలో పూజలు జరిపే ఆలయాలు రెండున్నాయి. అవే విజయ రాఘవ్‌రామ్ మందిర్, అమ్మాజీ మందిర్‌లు. వీటికి వందేళ్లకు పైబడిన చరిత్ర ఉంది. ఈ రెండు ఆలయాల గర్భగుడుల్లో కృత్రిమ కాంతిని పడనివ్వరు. అంటే విద్యుత్తు లైట్లే ఉండవు. ఏళ్ల తరబడి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. మూలవిరాట్‌లుండే గర్భగుడిని మాతృగర్భంగా భావిస్తారు.
అయోధ్యలో దక్షిణాది సంప్రదాయం.. శోభాయమానం - south India worship in north India
పల్లకీలో దేవ దేవేరీల ఊరేగింపు... వీధుల్లో సాగే ఆ ఊరేగింపు ముందు.. మనసును ఆధ్యాత్మిక డోలికల్లో ముంచెత్తే మంగళ వాద్యాలు. ఈ విధంగా అయోధ్యలో దక్షిణ భారత సంప్రదాయ విధానంలో పూజలు జరిపే ఆలయాలు రెండున్నాయి. ఈ సంప్రదాయం వందేళ్లకు పైబడి కొనసాగుతుండటం విశేషం.
గర్భిణులకు ఎక్స్-రే తీయడానికి, సీటీ స్కాన్ చేయడానికి వైద్యులు ఎలా సిఫార్సు చేయరో.. అదేరీతిలో ఇక్కడి మూలవిరాట్‌పై కూడా కృత్రిమ కాంతి పడకూడదన్న ఆచారం కొనసాగుతున్నట్లు అమ్మాజీ మందిర్ పూజారి వెంకటాచార్య స్వామి చెప్పారు. అంతేకాదు ఇక్కడి ఆలయంలో విద్యుత్తు పంపుల ద్వారా వచ్చే నీటిని కూడా వాడరు. బావిలోంచి తోడిన నీటిని మాత్రమే వినియోగిస్తారు. ఉత్సవాల్లో అలంకరణ సమయంలో కూడా విద్యుత్తు బల్బులను వాడరు. ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణ మూర్తులను ప్రత్యేకంగా ఊరేగిస్తుంటారు.
- విజయ రాఘవ్ రామ్ మందిర్‌లోనూ మూలవిరాట్‌పై లైటింగ్ పడనివ్వరు. కృత్రిమ కాంతి(లైటింగ్) శ్రీరాముడిపై పడటం మంచిది కాదని భావిస్తామని ఆలయ పూజారి ధారాచార్యజీ మహరాజ్ తెలిపారు. 1904లో నిర్మించిన ఈ ఆలయంలో గత 15 ఏళ్లుగా అఖండ రామనామ సంకీర్తన నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఇక్కడ కూడా బావిలోంచి తోడితీసిన నీటినే వినియోగిస్తుంటారు.
- అయోధ్యలోని విశిష్ట మందిరాల్లో త్రేతానాథ్ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయాన్ని భక్తుల కోసం నెలలో రెండు రోజులు మాత్రమే తెరుస్తారు. ఏకాదశి రోజుల్లోనే దర్శనం ఉంటుంది. అయితే నిత్య పూజలు మాత్రం తమ కుటుంబం జరుపుతుందని ఆలయ పూజారి సునీల్ మిశ్ర తెలిపారు. రద్దీ ఎక్కువైతే ఆలయం పాడవుతుందని పూర్వకాలంలో భావించేవారని.. అదే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోందని తెలిపారు.
- అయోధ్యలో లక్ష్మణుడికి ప్రత్యేకంగా ఓ ఆలయం ఉంది. దీన్నే లక్ష్మణకోటగా పిలుస్తారు. ఇక్కడ లక్ష్మణుడికి శేషావతారంలో పూజలు జరుపుతారు. 150 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పూజారి మైథిలి రామన్ శరణ్ తెలిపారు.
ఇదీ చూడండి:పాంగాంగ్‌పై చైనా తొండి- తగ్గాల్సిందేనని భారత్ పట్టు