గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున ఉన్న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్టాట్యూ .. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా రికార్డు సాధించింది. ఈ విగ్రహాన్ని నిర్మించి ఘన ఖ్యాతిని సంపాదించుకున్నారు హస్త కళాకారులు రామ్ సుతార్, అతని కుమారుడు అనిల్ రామ్ సుతార్. ఇప్పుడు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని సరయూ నదీ తీరాన 251 మీటర్ల (సుమారు 885 అడుగుల) ఎత్తైన శ్రీరాముని విగ్రహం తయారు చేసి, సొంత రికార్డును బద్దలుకొట్టనున్నారు.
నమూనా ఖరారు...
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సుప్రీం పచ్చ జెండా ఊపగానే... అయోధ్య నగరమంతా శ్రీరామమయం చేసే పనిలో పడింది యూపీ సర్కారు. ప్రపంచంలో ఎక్కడా లేనంత ఎత్తైన రామ విగ్రహాన్ని తయారు చేసేందుకు పూనుకుంది.
ఈటీవీ భారత్ రిపోర్ట్ ప్రకారం నోయిడాలోని సెక్టార్-63లో ఈ రాముడి విగ్రహం ఆకారం కోసం అనేక నమూనాలు తయారు చేశారు. ఈ స్వేత రామ నమూనాను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఖరారు చేశారు. అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా గర్వంగా రాముడు నిల్చున్నట్లు నమూనాను రూపొందించిన్నట్లు హస్తకళాకారుడు రామ్ సుతార్ తెలిపారు.