హిమాలయ పర్వతాల్లో ప్రయాణం అత్యంత క్లిష్టమైనది. కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటూ అప్రమత్తంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. తక్కువ దూరాలకే గంటల కొద్దీ సమయం పడుతుంటుంది. కానీ, ఇక మనాలి- లేహ్ మార్గంలో ఆ ఇబ్బందులకు గుడ్‌బై చెప్పే సమయం వచ్చేసింది. ఎందుకంటే... మంచుశిఖరాల అంచుల్లో నిర్మించిన అతి పెద్ద సొరంగ మార్గం ప్రారంభం అవుతోంది.
వ్యూహాత్మక ప్రత్యేకత..
అక్టోబర్ 3న ఉదయం 10గంటలకు ప్రధాని చేతుల మీదుగా ఈ అత్యాధునిక సొరంగం ప్రారంభోత్సవం కోసం హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్ సిద్ధంగా ఉంది. అనేక వ్యూహాత్మక ప్రయోజనాలున్న ఈ సొరంగంతో మనాలి- లేహ్ మధ్య దూరం 46 కిలోమీటర్లు తగ్గిపోతుంది. అంతేకాదు దాదాపు 4- 5 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. క్లిష్టమైన ప్రయాణాన్ని సురక్షితం చేస్తుంది. 9.02 కిలోమీటర్ల ఈ సొరంగ మార్గానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పేరు పెట్టారు. అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొనేలా, 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా అత్యాధునిక సాంకేతికతతో ఈ సొరంగాన్ని నిర్మించారు.
ఏడాది పొడవునా అన్ని వాతావరణ పరిస్థితులు తట్టుకుని దీటుగా నిలబడే ఈ సొరంగ మార్గం.. మనాలిని లేహ్‌లోని లాహౌల్-స్పితి లోయతో అనుసంధానం చేస్తుంది. గతంలో భారీమంచుతో ఈ లోయకు 6 నెలల పాటు రాకపోకలు నిలిచిపోయేవి.
ఈ టన్నెల్ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికత వినియోగించారు. హిమాలయాల్లోని పీర్ పంజాల్ పర్వతశ్రేణిలో 3వేల మీటర్లు.. అంటే సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తులో ఈ టన్నెల్ నెలవై ఉంది. ఈ సొరంగ మార్గం దక్షిణ ద్వారం.. మనాలికి 25 కిలో మీటర్ల దూరంలో ఉండగా.. ఉత్తర ద్వారం.. లాహౌల్ లోయలోని తెలింగ్ గ్రామం వద్ద ఉంది.
నిర్మాణమే.. నయా సోయగం
- అశ్వం ఆకారంలో నిర్మించిన ఈ సింగిల్ ట్యూబ్ టన్నెల్లో-డబుల్ లేన్ ఉంటుంది. 8 మీటర్ల విస్తీర్ణంలో రోడ్డు ఉంటుంది.
- 5.52 మీటర్ల ఓవర్‌హెడ్ క్లియరెన్స్ దీని ప్రత్యేకత.
- అగ్నిప్రమాద రహిత సాంకేతికత ప్రధాన టన్నెల్ నిర్మాణంలోనే అమర్చారు.
- 3వేల కార్లు, 1,500 ట్రక్కులు.. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా సొరంగం ఉంటుంది.
- ఈ అత్యాధునిక టన్నెల్లో ఎలక్ట్రోమెకానికల్ వ్యవస్థతో పాటు అధునాతన వెంటిలేషన్ వ్యవస్థలు ఉన్నాయి.
- ఎస్సీఏడీఏ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు నడుస్తుంటాయి.
భద్రతకు భరోసా
- రెండు ప్రవేశ ద్వాారాల వద్దా చెక్ పాయింట్లు ఉంటాయి.
- ప్రతి 150 మీటర్ల వద్దా అత్యవసర అవసరాలకు, టెలిఫోన్ అందుబాటులో ఉంటుంది.
- ప్రతి 60 మీటర్ల దగ్గర అగ్నిమాపక పరికరాలుంటాయి.
- ప్రమాదాలను పసిగట్టే నిఘా కెమెరాలు ప్రతి 250 మీటర్ల వద్ద ఏర్పాటు చేశారు.
- కిలోమీటర్ చొప్పును గాలి నాణ్యతను పరిశీలిస్తారు.
- ప్రతి 25 మీటర్లకు సంకేతాలకు సంబంధించిన బోర్డులు దర్శనమిస్తాయి.
- టన్నెల్ పొడవునా అధికారుల సూచనలు వినిపించే వ్యవస్థ ఉంటుంది.
- అగ్నిప్రమాదాలను పసిగట్టే కెమెరాలు ప్రతి 60 మీటర్లకు ఉంటాయి.
అద్యుడు అటల్
ఇలా అధునాతన హంగులతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఈ సొరంగ మార్గాన్ని రూ.3,300 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. ప్రత్యేకతల పరంగానే కాకుండా... దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో.. అత్యంత వ్యూహాత్మకమైన మార్గంగా, సైనిక అవసరాలకు కీలకంగా అటల్ టన్నెల్ నిలవనుంది.