తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుస్థిరమైన మహా సముద్రాల కోసం అన్వేషణ చేద్దాం! - Innovation for a Sustainable Ocean

మానవుడికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తూ.. ఏటా 3 ట్రిలియన్ డాలర్ల మేర ప్రయోజనం చేకూరుస్తున్నాయి మహా సముద్రాలు. మనిషి విడుదల చేస్తున్న కార్బన్​ డైయాక్సైడ్​లో 30శాతాన్ని పీల్చుకొని వెలకట్టలేని మేలు చేస్తున్నాయి. మానవాళి కోసం ఎనలేని సేవ చేస్తున్న మహా సముద్రాలు అదే మానవుడి ఆశకు బలై.. బోరున విలపిస్తున్నాయి. ఈ రోజు ప్రపంచ మహా సముద్ర దినోత్సవం.

World Oceans Day, 2020 to be celebrated virtually
ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం

By

Published : Jun 8, 2020, 8:25 PM IST

మానవుని దైనందిన జీవితంలో సముద్రాల ఎనలేని పాత్రకు గుర్తుగా.. ప్రపంచ మహా సముద్ర దినోత్సవం నిర్వహించుకుంటాం. సముద్రాల ద్వారా లభించే వనరులను సుస్థిర వినియోగాన్ని ప్రోత్సహిస్తూ.. వాటిని పరిరక్షించుకోవడానికి ఏటా జూన్ 8న ఈ వేడుక జరుపుకుంటాం.

ప్రతీ సంవత్సరంలాగే ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సారీ ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ఇతివృత్తాన్ని రూపొందించింది. 'సుస్థిరమైన మహాసముద్రాల కోసం ఆవిష్కరణలు' అనే అంశాన్ని ఎంపిక చేసింది. ఆశాభావంతో నిండి ఉన్న కొత్త విధానాలు, ఆలోచనలు, ఉత్పత్తుల ఆవిష్కరణే దీని లక్షమని ఐరాస ఉద్ఘాటించింది. దీంతో పాటు ఈ దశాబ్దపు ఇతి వృత్తాన్ని కూడా ప్రకటించింది. 'సముద్ర శాస్త్రాన్ని సమాజ అవసరాలకు అనుసంధానం చేసే పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడానికి.. 2021-30 దశాబ్దం అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేస్తుంద'ని పేర్కొంది.

ఎందుకు జరుపుకుంటామంటే..

  • రోజూవారి జీవితంలో మహా సముద్రాల పాత్ర గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేయడం.
  • మహా సముద్రాలను పరిరక్షించడానికి మానవులు చేయాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేయడం.
  • మహా సముద్రాల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఉద్యమించేలా చేయడం.
  • మహా సముద్రాల సుస్థిర నిర్వహణకు ప్రపంచ జనాభాను ఏకతాటిపైకి తీసుకురావడం.
  • సుందరమైన మహా సముద్రాల సంపదను కలసికట్టుగా ఆనందించడం.

సముద్రాల ప్రాముఖ్యత

  • భూమి మీద ఉన్న నీరు.. 97 శాతం మహాసముద్రాల్లోనే ఉంది.
  • మహా సముద్రాలు ధరిత్రీకి ఉపిరితిత్తుల్లాంటివి. మనం పీలుస్తున్న ఆక్సిజన్​లో ఎక్కువ భాగం సముద్రాల నుంచే వస్తోంది.
  • మానవులు ఉత్పత్తి చేస్తున్న కార్బన్ ​డైయాక్సైడ్​లో 30 శాతాన్ని మహా సముద్రాలు పీల్చుకుంటున్నాయి.
  • భూగోళంలో కీలకమైన ఈ భాగం నుంచి ప్రధానమైన ఆహారం, ఔషధాలు లభిస్తాయి.
  • ప్రపంచవ్యాప్తంగా ఏటా సముద్రాల నుంచి వెలికితీస్తున్న వనరుల విలువ 3 ట్రిలియన్ డాలర్లు.
  • మహాసముద్రాల్లో 2 లక్షలకు పైగా గుర్తించిన వివిధ జీవరాశులు ఉన్నాయి. ఇక గుర్తించని వాటి సంఖ్య లక్షల్లో ఉంటుంది.

కాలుష్య కోరల్లో..

మానవుడి అత్యాశ వల్ల మహాసముద్రాలకూ మకిలి అంటుకుంది. అభివృద్ధి మాటున మనిషి చేస్తున్న వికృత చేష్టలకు బలవుతున్నాయి. చాలా వరకు సముద్రాలు కాలుష్య కోరల్లో చిక్కుకుపోతున్నాయి.

మహా సముద్రాల కాలుష్యాలు ప్రధానంగా రెండు రకాలు.

1. రసాయన కాలుష్యం

మానవ కార్యాకలాపాల వల్ల రసాయన కాలుష్యం ఏర్పడుతోంది. సముద్ర తీరాల్లో నైట్రోజన్, పాస్ఫరస్ వంటి రసాయనాలు అధికంగా వచ్చి చేరుతున్నాయి. పొలాల్లో పురుగుల మందులు వాడటం, నదులు కలుషితం కావడం కూడా ఈ కాలుష్యానికి ప్రధాన కారణం.

2. చెత్త

సముద్ర చెత్తలో ప్లాస్టిక్​ భూతానిదే అధిక వాటా. 86 మిలియన్​ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో పేరుకుపోయినట్లు అంచనా. ప్రతీ నిమిషానికి ఓ ట్రక్కు నిండా ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో కలిసిపోతున్నాయి. సముద్ర జీవుల మనుగడకు ఈ ప్లాస్టిక్ మహమ్మారి పెను విఘాతం కలిగిస్తోంది. వందల సంవత్సరాల తర్వాత కూడా ప్లాస్టిక్ డీకంపోజ్ కాకుండా సముద్రాల్లోనే ఉండిపోతోంది.

ABOUT THE AUTHOR

...view details