హిందీ చిత్ర పరిశ్రమను అపఖ్యాతి పాల్జేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం తర్వాత హిందీ చిత్రసీమను లక్ష్యంగా చేసుకుని వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మల్టీప్లెక్స్, థియేటర్ యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
'హిందీ చిత్ర పరిశ్రమను అపఖ్యాతి పాల్జేయాలని గానీ.. మరో చోటుకు తరలించాలని గానీ ప్రయత్నాలు చేస్తే ఉపేక్షించేది లేదు. ముంబయి దేశానికి ఆర్థిక రాజధాని మాత్రమే కాదు.. వినోదాన్ని పంచే రాజధాని కూడా. ప్రపంచ వ్యాప్తంగా బాలీవుడ్ వినోదాన్ని అందిస్తోంది. అంతేకాకుండా ఈ చిత్ర పరిశ్రమ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇటీవల చిత్ర పరిశ్రమ పేరును దెబ్బతీయడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఎంతో బాధించాయి. చిత్రసీమ ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం వస్తోంది. కరోనా నేపథ్యంలో గత ఆరునెలలుగా మూసివేసిన థియేటర్లను తెరిచేందుకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానాల్ని తయారు చేస్తోంది. ఆ విధానం ఖరారయ్యాక థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటాం' అని ఉద్ధవ్ అన్నారు.