ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నారీమణుల శక్తిని కొనియాడుతూ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. అనంతరం తన సామాజిక మాధ్యమాల నిర్వహణ బాధ్యతను జీవితంలో పోరాడి విజయం సాధించి, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఏడుగురు మహిళలకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. వీరంతా తమ విజయగాథలను మోదీ ట్వీట్టర్, పేస్బుక్ ఖాతాల ద్వారా తెలియజేస్తున్నారు. #SheInspiresUs హ్యాష్‌ట్యాగ్‌తో ఈ కార్యక్రమ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ప్రధాని. ఈ మహిళలు లక్షల మందికి ప్రేరణగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
వేల మంది ఆకలి తీరుస్తున్న స్నేహమోహన్ దాస్..
ప్రధాని మోదీ ట్విట్టర్ ఖాతా ద్వారా మొదటగా తన విజయగాథను పంచుకునే అవకాశం స్నేహమోహన్ దాస్‌కు దక్కింది. ఒక్కపూట కడుపు నిండా భోజనానికి నోచుకోలేని ఎంతోమంది పేద, అభాగ్యులకు ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు స్నేహ. నిరాశ్రయుల ఆకలి తీర్చాలనే గొప్ప ఆలోచన తన తల్లిని చూసి నేర్చుకున్నట్లు వివరించారు. తల్లే తన ఆదర్శమని చెప్పారు.