వ్యయసాయ చట్టాలపై ఉద్యమిస్తున్న రైతులకు సోమవారం మహిళలే నేతృత్వం వహించారు. 'మహిళా రైతుల దినోత్సవం' పేరుతో దిల్లీ సరిహద్దుల్లో నిరసనల శిబిరాల్లో అన్ని ఏర్పాట్లూ వారే చూసుకున్నారు. 50 రోజులుగా కొనసాగుతున్న దీక్షలో వివిధ రాష్ట్రాల మహిళలు ఇప్పటికే పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. వారిలో పలువురు ఒక రోజంతా కార్యక్రమాలను ముందుండి నడిపారు. సందర్శకులను నియంత్రించడం, సేవకుల మధ్య సమన్వయం, వృద్ధ రైతులకు సాయపడడం, విరాళాల సేకరణ, భోజన ఏర్పాట్లు వంటివన్నీ వారే చూసుకున్నారు. సింఘూ సరిహద్దు శిబిరంలో వక్తలంతా మహిళలే కావడం విశేషం.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు, ధర్నాలు, సమావేశాలను అతివలే నిర్వహించారని 'అఖిల భారత రైతు పోరాట సమన్వయ సంఘం' నాయకురాలు కవిత కురుగంటి చెప్పారు. మరోవైపు వ్యవసాయ చట్టాల వివాదంపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ మంగళవారం తొలిసారి భేటీ కానుంది.