ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించే వరకు మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించాలని మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తీ దేశాయ్ అన్నారు. శబరిమలకు మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లను.. ఏడుగురు జడ్జిల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సుప్రీం నిర్ణయించిన అనంతరం... ఈ అంశంపై స్పందించారు తృప్తీ.
శబరిమల వెళ్లి పూజలు చేసేందుకు మహిళలకు ప్రవేశం ఉందని.. దీనికి వ్యతిరేకంగా ఎవరూ నిరసనలు చేయకూడదని అన్నారు తృప్తి. నవంబర్ 16న శబరిమల అయ్యప్ప క్షేత్రాన్ని దర్శించుకొని పూజలు నిర్వహిస్తానని తెలిపారామె.
"2018లో సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రకారం.. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై స్టే ఇవ్వలేదు. అందుకే ఈసారి ఉత్సవాలు ప్రారంభం కాగానే, ఏ మహిళ అయినా మందిరంలోకి ప్రవేశించవచ్చు. అక్కడి వారు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు. 2018లో సుప్రీం తీర్పు వారి ప్రవేశంపై విధించిన నిషేధం ఎత్తివేసింది. అక్కడికి వెళ్లిన మహిళలకు రక్షణ కల్పించి ఆలయం లోపలిదాకా పంపించాలి."