సమాజాన్ని మార్చేయాలని కలలు కన్నది ఆ మహిళ. నా ప్రాణం కంటే సమాజంలో మార్పే ముఖ్యమని అనుకుంది. ఇందుకు విప్లవ పంథాను ఎంచుకుని, జనజీవనాన్ని వీడింది. పోరాడేందుకు సిద్ధపడి నక్సలైట్లలో చేరింది. సహచరుడితో ఏర్పడిన సాన్నిహిత్యం గర్భవతిని చేసింది. కానీ... నెలలు నిండిన ఆమెను నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిపోయింది నమ్ముకున్న దళం.
ఛత్తీస్గడ్ కాంకేర్ జిల్లా ఆల్పరాస్ గ్రామ సమీపంలో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు ఐదేళ్ల బాలుడితోపాటు నిండు గర్భిణీగా చిక్కింది మహిళా నక్సలైట్. ఆమెను ఆస్పత్రిలో చేర్చిన పోలీసులు, పిల్లాడి యోగక్షేమాల కోసం అన్ని ఏర్పాట్లూ చేశారు. ఇటీవల ప్రసవించిన ఆమె కుదుటపడ్డాక... పుట్టిన శిశువుతో సహా వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయింది.