దిల్లీలో మహిళలు నేటి నుంచి ప్రభుత్వ బస్సుల్లో(డీటీసీ) ఉచితంగా ప్రయాణించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది కేజ్రీవాల్ ప్రభుత్వం. అక్టోబరు 29నుంచి దిల్లీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని గతంలో హామీ ఇచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్. ఆ హామీని దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు అమలు చేస్తున్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి దిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాశ్ గహ్లోత్ ట్వీట్ చేశారు.
" దిల్లీకి చారిత్రక రోజు. ఈరోజు నుంచి మహిళలు ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన వాగ్దానాన్ని నిలెబెట్టుకున్నారు. బస్సుల్లో మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది."
-కైలాశ్ గహ్లోత్ ట్వీట్.
పింక్ టికెట్స్
ప్రభుత్వ బస్సులలో ప్రయాణించే మహిళలకు రూ.10 ధరతో 'పింక్ టికెట్స్'ను ఇస్తారు కండక్టర్లు. ఈ టికెట్ల విలువ మేర రవాాణా సంస్థలకు చెల్లిస్తుంది దిల్లీ సర్కారు.
దిల్లీలో 3700 ప్రభుత్వ బస్సులు ఉండగా.. అదనంగా మరో 1800 ప్రైవేటు బస్సుల సేవలను ఈ పథకం కోసం వినియోగించుకోనుంది ప్రభుత్వం.
అధికారిక గణాంకాల ప్రకారం దిల్లోలో ప్రతిరోజు 45లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తారు. వీరిలో 30శాతం మంది మహిళలు.
మహిళలకు పటిష్ఠ భద్రత
మహిళల భద్రత కోసం ప్రభుత్వ బస్సుల్లో ప్రస్తుతం నియమించిన 3400 మంది మార్షల్స్‌ను 13వేలకు పెంచుతూ దిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నూతనంగా నియామకమైన అదనపు మార్షల్స్ నేటి నుంచి విధుల్లో చేరుతారు. ప్రపంచ దేశాల్లో ఏ నగరంలోనూ ప్రభుత్వ బస్సుల్లో భద్రత కల్పించడం కోసం ఈ స్థాయిలో చర్యలు తీసుకోలేదని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.
ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రసంగంలో భాగంగా దిల్లీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు సీఎం కేజ్రీవాల్. మెట్రో రైళ్లలోనూ ఈ సదుపాయాన్ని కల్పిస్తామని జూన్‌లో చెప్పారు. అయితే ఈ పథకం అమలుకు సమయం కావాలని దిల్లీ మెట్రో కార్పొరేషన్ కోరింది. అందువల్ల మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలుకు నోచుకోలేదు.
ఇదీ చూడండి : కశ్మీర్: ఉగ్రవాదుల దుశ్చర్యకు మరో డ్రైవర్ బలి