ఒడిశాలోని లోక్‌సభ స్థానాల్లో 33శాతం మహిళలకే కేటాయించిన బీజేడీ ఒడిశాలో లోక్‌సభ స్థానాల సంఖ్య 21. అందులో 33శాతం... అంటే 7 సీట్లు మహిళలకే ఇవ్వాలని నిర్ణయించింది అధికార బిజూ జనతా దళ్. ఈ ప్రకటన... ఎంతో మంది మహిళల్లో ఆశలు రేపింది. వారందరినీ టికెట్ల కోసం పార్టీ కార్యాలయానికి వరుస కట్టేలా చేసింది.
లోక్‌సభ సీట్లలో మాత్రమే మహిళలకు 33శాతం ఇస్తామని ప్రకటించింది బీజేడీ. శాసనసభ సీట్లలో రిజర్వేషన్‌పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయినా... అసెంబ్లీ ఎన్నికల్లోనూ అత్యధిక సంఖ్యలో మహిళలను బరిలోకి దించుతుందని భావిస్తున్నారు అంతా. శాసనసభ ఎన్నికల టికెట్ కోసం తెరవెనుక విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతో బీజేడీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
విజ్ఞాపనల పర్వం...
టికెట్లు దక్కవని అనుమానిస్తున్న సిట్టింగ్ ఎంపీలు... మహిళా రిజర్వేషన్‌ను అస్త్రంగా మలుచుకున్నారు. తమకు నిరాకరించినా.. కనీసం తమ భార్యకైనా కేటాయించాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు.
కోరాపుట్ ఎంపీ ఝినా హికాకా భార్య కౌశల్య, బాలాసోర్ ఎంపీ రబీంద కుమార్ జెనా భార్య సుభాషిణి, కలహండి ఎంపీ అర్కా కేశరీ దేవ్ భార్య మాలవికా దేవి... టికెట్ల కోసం బీజేడీ అధ్యక్షుడిని కలిశారు.
''నాకు రాజకీయాలు కొత్త. పార్టీ నాకు టికెట్ ఇస్తుందో లేదో తెలియదు. ఒకవేళ నా భర్తకు నిరాశ ఎదురైతే కలహండీ నుంచి నన్ను పోటీకి దించండి.''
- పట్నాయక్‌ను కలిసిన అనంతరం మాలవికా దేవి వ్యాఖ్య
''నా భార్య ఉపాధ్యాయురాలు. కానీ.. ప్రజాజీవితంలో నా వెంటే ఉన్నారు. రాజకీయాలను దగ్గర నుంచి చూశారు. పార్టీ ఈ సారి ఆమెకు టికెట్ ఇస్తుందని భావిస్తున్నాను.''
- కోరాపుట్ ఎంపీ హికాకా
పోంజీ కుంభకోణంలో ఆరోపణల కారణంగా జెనాకు టికెట్ దక్కకుంటే... ఆయన భార్య సుభాషిణికి అవకాశం కల్పిస్తారని ఊహాగానాలొస్తున్నాయి. సుభాషిణి సోదరుడు ప్రణబ్ ప్రకాశ్ దాస్ ప్రస్తుతం ఎమ్మెల్యే. ఆయన ద్వారానూ ఎంపీ టికెట్ కోసం ఆమె తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు.
వారికీ ఇబ్బందే...
మహిళలకు రిజర్వేషన్‌పై బీజేడీ నిర్ణయంతో.... ప్రత్యర్థి కాంగ్రెస్, భాజపాపైనా ఒత్తిడి పెరిగింది.
''లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో మహిళా అభ్యర్థుల్ని బరిలోకి దించాలని అధిష్ఠానానికి సూచించాం.''
- నిరంజన్ పట్నాయక్, ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
ప్రస్తుతం ఒడిశా తరఫున లోక్‌సభలో ముగ్గురు మహిళా సభ్యులు ఉన్నారు. 147 స్థానాలున్న శాసనసభలో మహిళలు 12 మందే.
ఒడిశాకు లోక్‌సభతో పాటే... శాసనసభకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇవి నాలుగు దశల్లో ఏప్రిల్ 11,18, 23, 29 తేదీల్లో జరగనున్నాయి. మే 23న ఫలితాలు ప్రకటించనున్నారు.