తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హరియాణాలో ఘోరం- పట్టపగలే విద్యార్థిని హత్య - లైవ్​లో యువతిపై కాల్పులు

పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ యువతిని తుపాకీతో కాల్చాడు ఓ వ్యక్తి. తీవ్రంగా గాయపడిన ఆ యువతిని ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయిన ఘటన హరియాణాలో జరిగింది. ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Women shot dead in live
లైవ్​లో యువతిపై గన్​ఫైర్

By

Published : Oct 27, 2020, 1:38 PM IST

Updated : Oct 28, 2020, 7:18 AM IST

హరియాణాలో పట్టపగలే ఓ విద్యార్థినిని యువకుడు తుపాకీతో కాల్చి చంపిన సంఘటన సంచలనం రేకెత్తించింది. పెళ్లికి నిరాకరించిందనే కారణంతోనే ఆ కిరాతకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను చంపి ప్రతీకారం తీర్చుకున్నానంటూ పోలీసులతో చెప్పడం అతడి రాక్షసత్వానికి అద్దం పడుతోంది. ఫరీదాబాద్‌ జిల్లాలోని బల్లబ్‌గఢ్‌లో జరిగిన ఘటన వివరాలివీ. నికితా తోమర్‌ బీకాం చివరి సంవత్సరం విద్యార్థిని. సోమవారం పరీక్ష రాసి తిరిగొస్తుండగా తౌసీఫ్‌ అనే యువకుడు రిహాన్‌ అనే వ్యక్తితో కలసి కారులో వచ్చి ఆమెను అడ్డగించాడు. కారులో బలవంతంగా తీసుకెళ్లే యత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి కారులో పారిపోయాడు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేసరికే ప్రాణాలు కోల్పోయింది. ఈ దుశ్చర్యపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. బాధితురాలి కుటుంబం న్యాయం చేయాలంటూ దిల్లీ-మధుర జాతీయ రహదారిని దిగ్బంధం చేసింది. పోలీసులు రంగంలోకి దిగి 24 గంటల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తౌసీఫ్‌ నేరాన్ని అంగీకరించాడు.

నిందితుడు తౌసీఫ్‌ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి అని, బాధితురాలిపై అతడు మూడేళ్లుగా వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. 2018లో పెళ్లి చేసుకోవాలంటూ తౌసీఫ్‌ ఆమెను అపహరించాడని, అప్పుడు పోలీసులు ఆమెను కాపాడారని చెప్పారు. ఆ సమయంలో తౌసీఫ్‌పై కేసు పెట్టామని, అయితే అతడికి వరుసకు సోదరుడైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అఫ్తఫ్‌ అహ్మద్‌ జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారని తెలిపారు. ఆ తర్వాతా తౌసీఫ్‌ వేధింపులు కొనసాగించాడని, ఇప్పుడు ఆమెను బలి తీసుకున్నాడని రోదించారు. అయితే తనపై బాధితురాలి కుటుంబం పెట్టిన కేసు కారణంగా తాను మెడిసిన్‌ చదవలేకపోయానని, అందుకే ఆమెను చంపి ప్రతీకారం తీర్చుకున్నానని తౌసీఫ్‌ పోలీసులకు చెప్పాడు. కాగా ఈ కేసు విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) చేపడుతుందని ఫరీదాబాద్‌ కమిషనర్‌ తెలిపారు.

లైవ్​లో యువతపై కాల్పులు

సుమోటోగా స్వీకరించిన ఎన్​సీడబ్ల్యూ

ఈ ఘటనను సుమోటోగా తీసుకుంటున్నట్లు జాతీయ మహిళా కమిషన్ (ఎన్​సీడబ్ల్యూ) ఛైర్​పర్సన్ రేఖా శర్మ తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడిని పట్టుకోవాలని హరియాణా డీజీపీకి లేఖ రాసినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:లైవ్​ వీడియో: అమాంతం జనంపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్​

Last Updated : Oct 28, 2020, 7:18 AM IST

ABOUT THE AUTHOR

...view details