అందరు ఆమె చనిపోయిందనుకున్నారు. ఆమె భర్తను మరో పెళ్లి చేసుకోమన్నారు. కానీ అతను మాత్రం తన భార్య బతికే ఉందని నమ్మాడు. ఆయన నమ్మకమే నిజమైంది. విడిపోయిన 14 ఏళ్ల తర్వాత తన భార్య ప్రమీలను కలుసుకున్నాడు దులేశ్వర్.
దులేశ్వర్, ప్రమీల దంపతులది ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పుర్ జిల్లా డుమ్రియా గ్రామం. ప్రమీల 2006లో మతిస్తిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య కోసం దులేశ్వర్ వెతకని చోటంటూ లేదు. చుట్టు పక్కల గ్రామాలే కాదు.. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ విస్తృతంగా వెతికాడు. కానీ భార్య జాడ మాత్రం దొరకలేదు.
మరో పెళ్లికి ససేమిరా..
బంధువులంతా ప్రమీల మరణించిందని, ఆమెకు పిండ ప్రదానం చేసేయాలనుకున్నారు. కుటుంబ సభ్యులంతా దులేశ్వర్ను మరో పెళ్లి చేసుకోవాలని కోరారు. కానీ దులేశ్వర్ అందుకు ఒప్పుకోలేదు. తన భార్య బతికే ఉందని దృఢంగా నమ్మాడు.
దులేశ్వర్ నమ్మినట్టే.. దారి తప్పిన ప్రమీల కోల్‌కతాలోని ఓ ఆశ్రమానికి చేరింది. 14 ఏళ్ల తరువాత ఆ ఆశ్రమ డైరెక్టర్ తులసీ మాయతీ.. ఛత్తీస్‌గఢ్ పోలీసులకు రాసిన ఓ లేఖ ద్వారా తిరిగి ఇంటికి చేరుకుంది.
"2006 అక్టోబర్ 26న తన భర్య ప్రమీల కనపడటం లేదని దులేశ్వర్ యాదవ్ భట్గావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేశారు. కానీ, ఎంత ప్రయత్నించినా ఆమె జాడ దొరకలేదు. ఈ ఫిబ్రవరి 6న గార్డెన్ బంగాల్ నుంచి ఓ ఉత్తరం వచ్చింది. డుమ్రియా గ్రామానికి చెందిన ప్రమీల కోల్‌కతాలోని ఓ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతోందని, ఆమె భర్త పేరు దులేశ్వర్ యాదవ్ అని అందులో రాసుంది. అప్పుడే మేము ఇక్కడి నుంచి ఓ బృందాన్ని పంపించి ఆమెను తీసుకువచ్చాం."
- హరీశ్ రాథోడ్, పోలీస్ అధికారి