రోడ్డుపై వెళుతుండగా అధికార పార్టీ బ్యానర్ మీద పడి కాలు కోల్పోయిన మహిళకు సర్కారు కొలువు ఇచ్చింది తమిళనాడు ప్రభుత్వం. రాష్ట్రంలోని కోయంబత్తూర్‌కు చెందిన బాధితురాలు 30 ఏళ్ల రాజేశ్వరికి నియామక పత్రాలను అందజేశారు మున్సిపల్ శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి.
రాజేశ్వరికి నియామక పత్రం అందిస్తున్న వేలుమణి గతేడాది నవంబర్ 11న రహదారిపై స్కూటర్‌పై వెళుతున్నారు రాజేశ్వరి. ఆ సమయంలో రోడ్డు పక్కన కట్టిన అన్నాడీఎంకే బ్యానర్ రాజేశ్వరిపై పడబోయింది. దానిని తప్పించుకునే ప్రయత్నంలో ఆమె వాహనాన్ని లారీ ఢీకొట్టింది.
ఎడమకాలు తొలగింపు..
ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయం తీవ్రం కావటం వల్ల నాలుగు రోజుల తర్వాత రాజేశ్వరి ఎడమకాలిని మోకాలు వరకు తొలగించారు వైద్యులు. ఈ ఘటనతో ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీ డీఎంకే తీవ్రంగా విమర్శించింది.
ఇదే మొదటిసారి కాదు..
గతంలోనూ చెన్నైలో అన్నాడీఎంకే పార్టీకి చెందిన బ్యానర్ పడటం వల్ల ఓ యువతి అదుపుతప్పి లారీ కిందపడి మరణించింది. తమిళనాడులో పార్టీ ప్రచార బ్యానర్లపై హైకోర్టు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి: చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను బలిగొన్న పెళ్లి ఫ్లెక్సీ