ఆమె వయసు 30 ఏళ్లు. అందరు ఆడవాళ్లలానే కనిపించే ఆమెకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. బంగాల్ భీర్బంలో భర్తతో కలిసి సాధారణ జీవితం గడుపుతోంది. పిల్లలు కావాలని అనుకున్నప్పటికీ తన కడుపు పండక కుంగిపోయేది. అయితే కొన్ని నెలల క్రితం కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లింది మహిళ. ఈ నేపథ్యంలో పరీక్షలు చేసిన వైద్యులు ఆశ్చర్యకర నిజాలను బయటపెట్టారు. ఆమె మహిళ కాదని.. పురుషుడని తేల్చారు. ఆమె వృషణాల క్యాన్సర్తో బాధపడుతోందని, ఆండ్రోజెన్ ఇన్సెన్సిటివిటీ సిండ్రోమ్ లక్షణాలు ఉన్నట్లు వెల్లడించారు. 22,000 మందిలో ఒక్కరికి మాత్రమే ఈ సమస్యలు ఉంటాయని వివరించారు.
"ఆమె కడుపునొప్పితో మా వద్దకు వచ్చినప్పుడు పరీక్షలు చేసి శరీరంలో వృషణాలు ఉన్నట్లు గుర్తించాం. అనంతరం మరిన్ని పరీక్షలు చేసి టెస్టికల్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధరించాం. ఆమె బయటకు మహిళలానే కనిపిస్తుంది. స్వరం, వక్షోజాలు సహా అంతా ఆడవాళ్లలానే ఉంటాయి. అయితే ఆమె పుట్టిననాటి నుంచే శరీరంలో గర్భాశయం, అండాశయం లేవు. ఇప్పటివరకు రుతుస్రావం జరగలేదు."
-అనుపమ్ దత్తా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యాన్సర్ ఆస్పత్రి వైద్యులు