దేశంలో జరుగుతున్న వరుస అత్యాచార ఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ హాథ్రస్ ఘటన మరువక ముందే అలాంటి దారుణాలు వెలుగు చూస్తునే ఉన్నాయి. మధ్యప్రదేశ్ నర్సింగ్పుర్ జిల్లా గాడర్వారలో ఐదు రోజుల క్రితం సామూహిక అత్యాచారానికి గురైంది ఓ 32 ఏళ్ల దళిత మహిళ. శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసేందుకు మూడు రోజులు స్టేషన్ చుట్టూ తిరిగినా పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ విషయంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకునేలా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. స్టేషన్ ఇంఛార్జ్‌ని అరెస్టు చేయడం సహా, ఏఎస్పీ, ఎస్డీఓపీలను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది.
ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరొకరి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
మేనకోడిలిపైనే..
ఝార్ఖండ్ ఖుంతి జిల్లా గుల్లు గ్రామంలో 12 ఏళ్ల మేనకోడలిపైనే అత్యాచాారానికి పాల్పడ్డాడు 32 ఏళ్ల మృగాడు. తన సోదరుడితో కలిసి ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లి నిర్మాణంలో ఉన్న భవనంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు.