తెలంగాణ

telangana

By

Published : Aug 24, 2019, 5:11 AM IST

Updated : Sep 28, 2019, 1:49 AM IST

ETV Bharat / bharat

'నిర్మల' వరాలపై వివిధ వర్గాల స్పందన

మందగమనంతో సాగుతున్న ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు నిర్ణయం తీసుకుంది కేంద్రం. విదేశీ సంస్థాగత పెట్టుబడులపై విధించిన సర్​ఛార్జీల పెంపు ఉపసంహరణ, పన్ను అనంతరం ఆదాయం పెంపు దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వివిధ వర్గాల నుంచి సానుకూల స్పందన కనిపిస్తోంది.

'ఆర్థిక' నిర్ణయంపై వివిధ వర్గాల స్పందన

విదేశీ పెట్టుబడుల రాక, పన్ను అనంతర ఆదాయాన్ని పెంచే దిశగా కేంద్రం తీసుకున్న ఎఫ్​పీఐలపై సర్​ఛార్జీ రద్దు నిర్ణయంపై ఆయా రంగాల ప్రముఖులు సానుకూలంగా స్పందించారు.

"ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఒత్తిడిని ఎదుర్కోవడానికి తగిన సమయంలో తీసుకోవలసిన అనేక చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తోంది."

-రాజీవ్​కుమార్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్

స్టాక్ విశ్లేషకులు...

బడ్జెట్​ సందర్భంగా ప్రవేశపెట్టిన విదేశీ సంస్థాగత పెట్టుబడులపై సర్​ఛార్జీల రద్దుతో స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రభావం ఉంటుందని, పెట్టుబడుల ఉపసంహరణకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని... విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

"ఎఫ్​పీఐలపై సర్​ఛార్జీ రద్దు భారతీయ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. బడ్జెట్​ అనంతరకాలంలో ఎక్కువైన విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ... నిలిచిపోయే అవకాశం ఉంది. రూపాయి విలువ బలపడేందుకు వీలు ఉంది. భారతీయ ఆర్థిక రంగానికి బూస్టర్​లా పనిచేయనుంది."

-రష్మిక్ ఓజా, కొటాక్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు.

"ప్రభుత్వ నిర్ణయం విస్తృతమైనది. ఇందులో స్వల్పకాలిక లాభాలతో పాటు దీర్ఘకాలిక లాభాలు ఉన్నాయి. ఎఫ్​పీఐలపై సర్​ఛార్జీల తగ్గింపు నిర్ణయం తక్కువ కాలంలో తీసుకున్నప్పటికీ దీర్ఘకాలికంగా అమిత ప్రభావాన్ని చూపుతుంది."

-ఆశీశ్ కుమార్, బీఎస్​ఈ ఎండీ

"ఎట్టకేలకు ఆర్థిక రంగానికి ఊతమిచ్చే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుదారులు, పెట్టుబడిదారుల ఆకాంక్షలను నెరవేర్చింది. కునారిల్లుతున్న ఆటోమొబైల్ రంగానికి చేయూతనిచ్చేదిగా సర్కారు నిర్ణయం ఉంది. "

-గౌరవ్ దువా, షేర్​ఖాన్ సెక్యూరిటీస్

పరిశ్రమ వర్గాలు...

"విదేశీ సంస్థాగత పెట్టుబడులపై సర్​ఛార్జీల తొలగింపు, పన్ను అనంతర లాభంపై అదనపు సుంకం తొలగింపు అత్యంత ప్రాధాన్యమైన నిర్ణయం. పరిశ్రమను పునరుత్తేజం చేసేలా ఉంది."

-ఆనంద్ మహీంద్ర, మహీంద్ర గ్రూప్ ఛైర్మన్

"ప్రభుత్వ సత్వర నిర్ణయం కేవలం పరిశ్రమకు మాత్రమే కాదు. సామాన్యులకు భరోసా ఇచ్చేదిగా ఉంది. మార్కెట్లోకి ధనప్రవాహన్ని పెంచి... చిన్న, మధ్యతరహా రంగాలపై ఒత్తిడి తగ్గిస్తుంది."

-వేణు శ్రీనివాసన్, టీవీఎస్ మోటార్ కో ఛైర్మన్

"ప్రభుత్వ ప్రకటన పెట్టుబడులు, డిమాండ్​ను పెంచేదిగా ఉంది. సులభతర వాణిజ్యం, సంపద సృష్టికర్తలకు తగిన గుర్తింపు అందించేదిగా ఉంది."

-శరద్​కుమార్ సరాఫ్, భారత ఎగుమతుల సమాఖ్య

'ఆర్థిక సంక్షోభానికి అంగీకారం'

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందన్న దానిని అంగీకరింపజేసేలా ఉందని ఆరోపించింది విపక్ష కాంగ్రెస్ పార్టీ. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనాన్ని వీడాలని డిమాండ్ చేసింది.

అవసరమైన వారి చేతుల్లోకే ధనప్రవాహం ఉండాలని... అత్యాశపరుల చేతుల్లోకి కాదన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​గాంధీ.

రాహుల్ ట్వీట్

"ప్రభుత్వ సొంత ఆర్థిక సలహాదారులే... వ్యవస్థ మందగమనంతో సాగుతోందని గుర్తించారు. మా సూచనలు అంగీకరించి ఆర్థికవ్యవస్థను పునరుత్తేజింపజేయండి. అత్యాశపరుల చేతుల్లో కాక అవసరమైన వారికే ధనాన్ని అందించండి."

-రాహుల్ గాంధీ, ట్వీట్

ఇదీ చూడండి: బుజ్జి జింకను కాపాడిన పెద్ద మనసులు!

Last Updated : Sep 28, 2019, 1:49 AM IST

ABOUT THE AUTHOR

...view details