మూడు వందలకు పైగా పులులు.. అందులో మూడు ఆడ పులులు. రంగురంగుల చిరుతలు.. కాళ్లకు గజ్జెకట్టి, నడుముకు గజ్జెల ఒడ్డానం పెట్టి ఒక్క చోట చేరి చిందులేశాయి. కేరళ త్రిస్సూర్‌లో ఓనం ముగింపు వేడుకల్లో సంప్రదాయ పులీక్కళి నృత్యాలు మరింత శోభను నింపాయి.
ఎటు చూసినా ఉత్సాహమే..
ఏటా జరిగే పులిక్కళి ఉత్సవాల్లో ధైర్యానికి ప్రతీకగా ఉండే పులి వేషాలు ధరిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఇక్కడి వారి నమ్మకం. అందుకే అనాధిగా పులి వేషధారణలో నృత్యం చేసి తోటివారిని ఉత్సాహపరిచి ఓనం వేడుకలను ముగిస్తారు.
గతేడాది వరదల కారణంగా ఈ ప్రాంతంలో పులీక్కళి వేడుకలు రద్దయ్యాయి. కానీ ఈ సారి మాత్రం ఘనంగా జరిగాయి. ఈ వేడుక కోసం స్వరాజ్ మైదానంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ ఉత్సవం తెల్లవారే వరకు కోలాహలంగా సాగింది.
పులులా.. మనుషులా?
వివిధ ప్రాంతాల నుంచి ఆరు బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఒక్కో బృందంలో 51 మంది చొప్పున మూడు వందలకు పైగా కళాకారులుంటారు. వారంతా ఉదయం నాలుగింటి నుంచే సంప్రదాయ రంగులు పూసుకుని శరీరాలను పులిలా మార్చుకున్నారు. పెద్ద పులుల చారలు, చిరుత పులుల మచ్చలు ఇలా రకరకాల పులి అవతారాల్లో సిద్ధమయ్యారు.