రామాయణ ఇతిహాస గాథలు, భజన పాటలతో కూడిన సరికొత్త 'రామాయణ ఎక్స్ప్రెస్' రైలును పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా శ్రీరాముడు కొలువై ఉన్న అన్ని దేవాలయాలను కలుపుతూ వెళ్లే ఈ సరికొత్త రైలుకు ఈ మార్చి నెలాఖరుకల్లా పచ్చజెండా ఊపేలా ప్రణాళికలు రచిస్తోంది. ఫలితంగా భక్తులకు కదిలే ఆలయంలో ఉన్న అనుభూతి కలుగుతుందని రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ స్పష్టం చేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మార్చి 10న రామాయణ ఎక్స్ప్రెస్ పట్టాలెక్కుతుందని ప్రకటించారు.
"దేశవ్యాప్తంగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం ఇలా అన్ని ప్రాంతాలకు ఈ రైలు ప్రయాణిస్తుంది. ఫలితంగా ప్రయాణికులు అందరూ రామాయణ ఎక్స్ప్రెస్ సేవలు పొందేందుకు వీలుంటుంది. రైలు లోపల, బయటి భాగాలు మొత్తం రామాయణ ఇతివృత్తాలతో నిండి ఉంటాయి. రైలులోనే భజనలు కూడా ఏర్పాటు చేస్తాం. రైలు నడిచే సమయాలు, ప్యాకేజీలపై ఐఆర్సీటీసీ కసరత్తులు చేస్తోంది. హోలీ పండుగ తర్వాత రైలు పట్టాలెక్కుతుందని ఆశిస్తున్నాం."
- వీకే యాదవ్, రైల్వే బోర్డు ఛైర్మన్