తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలతో భారత్ అస్త్రశస్త్రాలను పెద్దఎత్తున మోహరించిన వేళ.. చైనా తన వ్యూహం మార్చుకుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో దశబ్దాలుగా వివాదాస్పదం చేస్తూ వస్తున్న అరుణాచల్‌పై మరోసారి డ్రాగన్ దృష్టి పెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. తదుపరి వ్యూహంలో భాగంగా చైనా మరిన్ని బలగాలను అరుణాచల్ సరిహద్దులో మోహరించనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాతో 1,126 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది అరుణాచల్ ప్రదేశ్. అక్కడ సమస్యలను సృష్టించటం ద్వారా భారత బలగాలను ఆయా ప్రాంతాల్లో మోహరించేలా చేసి ఇతర ప్రాంతాల్లో భద్రతను బలహీన పరిచేందుకు చైనా కుట్ర పన్నుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని మెుత్తం 25కు గానూ 13 జిల్లాలు చైనా, భూటాన్, మయన్మార్‌లతో సరిహద్దులను కలిగి ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా అరుణాచల్ ప్రదేశ్‌ను భారత భూభాగంగా చైనా గుర్తించటం లేదు. ఇప్పటికీ తమ ప్రాంతంగానే భావిస్తోంది. చైనీయులు అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా పిలుస్తారు. లద్ధాఖ్‌లోని వాస్తవాధీన రేఖ మాదిరిగా.. టిబెట్ సహా ఈశాన్య భారతానికి మధ్య సరిహద్దుగా మెక్‌మోహన్ రేఖ ఉంది. దీనిని 1914లో బ్రిటిష్ ఇండియా విదేశాంగ కార్యదర్శి ఆర్థర్ హెన్రీ మెక్ మోహన్ ఏర్పాటు చేశారు. అప్పట్లో దీన్ని బ్రిటిష్ ఇండియా, టిబెట్‌లు అంగీకరించాయి. కానీ చైనా మెక్‌మోహన్ రేఖను అంగీకరించటం లేదు. అరుణాచల్ లోని 65 వేల చదరపు కిలోమీటర్ల భూభాగం తమదేనని వాదిస్తోంది.
అక్కడి పరిస్థితులు వేరు..