తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మసకబారుతున్న 'కాషాయ' ప్రభ! - BJP LOSSES JHARKHAND POLLS

2019 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన భాజపాకు ప్రస్తుతం దేశంలో ఎదురుగాలి వీస్తోంది. ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బ తగలడం ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. 2017లో హిందీ ప్రయుక్త రాష్ట్రాల్లోని 71 శాతం ప్రాంతం భాజపా అధీనంలో ఉండగా ప్రస్తుతం అది 35 శాతానికి పడిపోయింది. రెండేళ్ల క్రితం దేశంలోని 69 శాతం జనాభాను స్వయంగా లేదా మిత్ర పక్షాలతో కలిసి పాలించిన భాజపా... నేడు 43 శాతం జనాభాను మాత్రమే పాలించే స్థితికి చేరింది.

BJP footprint shrinks to half from 2017 peak
శిఖరం నుంచి జారిపోతున్న కాషాయపార్టీ ప్రభ!

By

Published : Dec 24, 2019, 5:39 AM IST

Updated : Dec 24, 2019, 12:18 PM IST

మసకబారుతున్న 'కాషాయ' ప్రభ!

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి... పతనమవుతున్న భాజపా ప్రాభవాన్ని తేటతెల్లం చేస్తోంది. కాంగ్రెస్​ ముక్త్​భారత్​ చేపడతామని.. పలు సందర్భాల్లో పేర్కొన్న కాషాయ పార్టీ అగ్రనేతలకు ప్రస్తుత పరిణామాలు మింగుడుపడటం లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన భాజపా.. కేవలం ఆరు నెలల కాలంలో మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడం గమనార్హం. 2017లో అత్యధిక ప్రాంతంలో అధికారంలో ఉన్న భాజపా.. ప్రస్తుతం అంచలంచెలుగా అధికారానికి దూరమవుతోంది.

మసకబారుతున్న 'కాషాయ' ప్రభ!

ఓటమిల పరంపర

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యాయి. హరియాణాలో అనుకున్న మెజారిటీ రాకపోయినప్పటికీ జేజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. అయితే.. మహారాష్ట్రలో మాత్రం శివసేనతో విభేదించి అధికారానికి దూరమైంది. తాజాగా ఝార్ఖండ్​లో ఓటమి మూటగట్టుకుంది.

శిఖరం నుంచి జారుతోంది..

2017లో హిందీ ప్రయుక్త రాష్ట్రాల్లోని 71 శాతం ప్రాంతం భాజపా అధికారంలో ఉండగా... నేడు అది 35 శాతానికి పడిపోయింది. రెండేళ్ల క్రితం దేశంలోని 69 శాతం జనాభాను స్వయంగా లేదా మిత్ర పక్షాలతో కలిసి పాలించిన భాజపా... నేడు 43 శాతం జనాభాను మాత్రమే పాలించే స్థితికి చేరింది. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​లో అధికారం కోల్పోయిన కాషాయ పార్టీ.. క్రమంగా తన ప్రాభవాన్ని మరింతగా కోల్పోతోంది. తాజాగా హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖండ్​ ఎన్నికల్లోనూ దెబ్బతింది. దీనికి ప్రధాన కారణం జాట్​, మరాఠా, గిరిజనుల వ్యతిరేకతేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అతిపెద్ద ఓటమి..

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి జేఎంఎంను విడిచిపెట్టి ఒంటరిగా పోటీ చేసిన భాజపాకు చావుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి అభ్యర్థి రఘుబర్​ దాస్ స్వయంగా భాజపా తిరుగుబాటు నాయకుడు సరయు రాయ్​ చేతిలో ఓడిపోయారు. ఆరుగురు మంత్రులు, స్పీకర్ కూడా ఓటమిపాలయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత భాజపాకు ఎదురైన అతిపెద్ద ఓటమి ఇదే కావడం గమనార్హం.

భారీగా తగ్గుతున్న ఓటింగ్

లోక్​సభ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని భాజపా అత్యధిక ఓటింగ్ సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే తరువాత జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి పోలైన ఓట్లు ఘననీయంగా తగ్గిపోయాయి.

లోక్​సభ ఎన్నికల్లో కాషాయపార్టీకి ఝార్ఖండ్​లో 55 శాతం, హరియాణాలో 58 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. అయితే కొద్ది నెలల్లోనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటింగ్ శాతం వరుసగా 33 శాతం, 36 శాతానికి పడిపోయింది.

అధికరణ 370 రద్దు, ముమ్మారు తలాక్​ బిల్లుకు ఆమోదం, అయోధ్య రామమందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీం తీర్పు రావడం, పౌరసత్వ చట్ట సవరణ తీసుకురావడం లాంటి అంశాలన్నీ భాజపాకు సానుకూల అంశాలే. ఈ విషయాల్నే ఆ పార్టీ అగ్రనాయకులు ఎన్నికల ప్రచారంలో గొప్పగా చెప్పుకున్నారు. అయినప్పటికీ కాషాయ పార్టీకి ఝార్ఖండ్​లో ఎదురుగాలి వీయడం విశేషం.

ముందుంది మొసళ్ల పండుగ

పౌరసత్వ చట్ట సవరణ, దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీ అంశంపై భాజపాకు వ్యతిరేక గాలి వీస్తోంది. త్వరలో దిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి కేంద్రీకరించాలని భాజపా అధిష్ఠానంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: 'రాజ్యాంగంపై దాడి చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు'

Last Updated : Dec 24, 2019, 12:18 PM IST

ABOUT THE AUTHOR

...view details