ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలంటే మామూలు విషయం కాదు. లక్షల మందితో ప్రచార సభలు, కిలోమీటర్ల మేర ర్యాలీలు, భారీ జనసందోహం మధ్య రోడ్ షోలు... ఈ తతంగమంతా ఓ పండగలా జరుగుతుంది. ప్రజల సమక్షంలో నేతల హామీలు, ప్రతిపక్షాలపై విమర్శలు- ప్రతివిమర్శలు జోరుగా సాగుతుంటాయి.
కానీ, కరోనా వైరస్ ప్రతాపం వల్ల వైభవంగా జరిగే ఈ కార్యక్రమాలు మసకబారే అవకాశం ఉంది. నాయకులు వాగ్బాణాలు సంధించుకున్నా.. అవి ఎక్కువగా ఆన్‌లైన్‌కే పరిమితం కానున్నాయి. భారీ సభలు లేకుండా సామాజిక మాధ్యమాల్లోనే ప్రచారం నిర్వహించే పరిస్థితులు తలెత్తుతున్నాయి.
ఇప్పటికే షురూ
ఈ సంవత్సరం బిహార్ శాసనసభ ఎన్నికలు జరగనుండగా.. వచ్చే ఏడాది తమిళనాడు, బంగాల్ రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగనుంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ఆన్లైన్ ప్రచారంవైపే మొగ్గుచూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
బిహార్‌లోని అధికార పార్టీ జనతా దళ్ యునైటెడ్(జేడీయూ) ఇప్పటికే ఈ తరహా ప్రచారానికి సిద్ధమైంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆన్లైన్లోనే ప్రచారం నిర్వహించే విధంగా కసరత్తులు చేస్తోంది. సామాజిక మాధ్యమాలను సమర్థంగా ఉపయోగించుకోవాలని కార్యకర్తలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. తొలిసారి ఓటు వేయబోయే యువ ఓటర్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ పేజీలను తయారు చేసి పార్టీకి ప్రజలకు మధ్య వారధిగా ఉపయోగించుకోవాలని కార్యకర్తలను కోరారు.
యువతపై దృష్టి
యువత ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లోనే సమయం గడుపుతున్న నేపథ్యంలో ఈ వేదికను ఉపయోగించుకునే విధంగా పార్టీ యంత్రాంగం ప్రణాళికలు రచిస్తోంది.