బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత పాక్ వాయుసేనతో వీరోచితంగా తలపడ్డ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను ప్రభుత్వం వీర్‌చక్ర పురస్కారంతో సత్కరించనుందని సమాచారం. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఈ అవార్డును అందించే అవకాశముంది.
పుల్వామా-బాలాకోట్ దాడుల అనంతరం... ఫిబ్రవరి 27న భారత గగనతలంలోకి చొరబాటుకు యత్నించిన పాక్ విమానాలను తిప్పికొట్టారు అభినందన్. తాను నడుపుతున్న మిగ్-21 విమానం ప్రత్యర్థి భూభాగంలో కూలిపోయిన కారణంగా దాయాది సేనలకు చిక్కారు. పాక్ సంయమనం వహించాలని, వింగ్ కమాండర్‌ను విడుదల చేయాలన్న అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో మార్చి 2న అభినందన్‌ను విడిచిపెట్టింది పాక్.
మరికొద్ది రోజుల్లో విధుల్లోకి...
బెంగళూరులోని వైమానిక దళ ఆసుపత్రి అభినందన్‌కు సంపూర్ణ వైద్య పరీక్షలు నిర్వహించి... మళ్లీ విమానాలు నడిపేందుకు అనుమతి ఇచ్చింది. మరికొద్ది వారాల్లో మిగ్-21తో గగనతలంలో విన్యాసాలు చేయనున్నారు అభినందన్.