తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో కాలుష్య తీవ్రత కాస్త తగ్గుముఖం.. కానీ..! - delhi pollution news

దిల్లీలో శనివారం కాలుష్య తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ ఈ స్థాయి ప్రమాదకరమేనని అధికారులు తెలిపారు. నవంబరు 8,9 తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున కాలుష్య తీవ్రత ప్రభావం మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

దిల్లీలో కాలుష్య తీవ్రత కాస్త తగ్గుముఖం.. కానీ..!

By

Published : Nov 2, 2019, 1:16 PM IST

Updated : Nov 2, 2019, 11:41 PM IST

దిల్లీలో కాలుష్య తీవ్రత కాస్త తగ్గుముఖం

దిల్లీలో గాలి వేగంగా వీస్తుండటం వల్ల కాలుష్య స్థాయిలో శనివారం కాస్త తీవ్రత తగ్గింది. శుక్రవారం నాడు వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ)-484గా నమోదు కాగా, శనివారం 407కు తగ్గి చిన్నపాటి ఉపశమనం కల్పించింది. అయితే.. ఈ స్థాయి కూడా ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు.

జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్​సీఆర్​)లోని గాజియాబాద్​, గ్రేటర్​ నోయిడాలలో శనివారం వాయు నాణ్యత ప్రమాణాలు వరుసగా 459, 452గా నమోదయ్యాయి. శుక్రవారం ఈ స్థాయి 496గా ఉంది. గాలి వేగంలో గణనీయమైన మెరుగుదల ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఆదివారం నుంచి మంగళవారం వరకు ఈ ప్రాంతంలో గంటకు సుమారు 20 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించారు అధికారులు.

వర్షాలు పడే సూచన

పంజాబ్​, హరియాణా, రాజస్థాన్​, దిల్లీ ప్రాంతాల్లో నవంబరు 8,9 తేదీల్లో మహా తుపాను కారణంగా అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా.. కాలుష్య తీవ్రత తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కాలుష్య తీవ్రత తగ్గేంత వరకు దిల్లీలో మార్నింగ్‌ వాక్‌కు, కార్యాలయాలకు వెళ్లే స్థానికులు మాస్క్‌లు ధరించి వెళ్లాలని సూచించారు.

అత్యవసర పరిస్థితి

వాయు కాలుష్యం ప్రమాదకర స్థితిని దాటి పోవడం వల్ల కాలుష్య నియంత్రణ మండలి దిల్లీ-ఎన్​సీఆర్​ ప్రాంతంలో శుక్రవారం ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితిని విధించింది. నవంబరు 5 వరకు నగరంలో.. భవన నిర్మాణాలపై నిషేధం విధించింది. విద్యాసంస్థలను కూడా మూసేయాలని నిర్ణయించింది.

రోడ్లపై నీళ్లు చల్లుతూ

కాలుష్య నియంత్రణ పరిష్కార చర్యగా మునిసిపల్​ కార్పొరేషన్(ఐడీఎంసీ) గీతా కాలనీ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోడ్లపై వాహనాలతో నీటిని చల్లుతోంది.

ఇదీ చూడండి : వాట్సాప్​పై కేంద్రం అసహనం.. 'పెగసస్'​పై వివరణకు ఆదేశం

Last Updated : Nov 2, 2019, 11:41 PM IST

ABOUT THE AUTHOR

...view details