ప్రజలు భౌతిక దూరం పాటించకుంటే లాక్‌డౌన్ సడలింపును ఉపసంహరించుకుంటామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కేంద్రం సూచనలకు అనుగుణంగా దిల్లీలో కంటైన్‌మెంట్‌జోన్ పరిధిలో లేని ప్రాంతాల్లో సోమవారం నుంచి లాక్‌డౌన్ నిబంధనలను సడలించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు సాధారణ కార్యకలాపాలు కొనసాగించేందుకు అధికారులు అనుమతిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజలు భౌతిక దూరం పాటించకుండా మద్యం దుకాణాల ముందు గుమిగూడటంపై విమర్శలు వెల్లువెత్తాయి.
మద్యం దుకాణాలకు ఇలా వెళ్తే ఎలా? : కేజ్రీవాల్
లాక్‌డౌన్ సడలింపుతో దేశ రాజధాని దిల్లీలో వైన్‌షాపుల వద్ద జనాలు గుమిగూడటంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రతిఒక్కరూ ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలని సూచించారు. నిబంధనల్ని ఉల్లంఘిస్తే లాక్‌డౌన్ సడలింపులను ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు.
తాజాగా ఈ ఘటనలపై స్పందించారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ప్రజలంతా తప్పకుండా ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలని, దుకాణ యజమానులు ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దుకాణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయరు. అందుకనుగుణంగా మేం కఠిన చర్యలు తీసుకుంటున్నాం. మనమంతా బాధ్యతగల పౌరుల్లా వ్యవహరించాలి. ఒక వేళ ఏదైనా దుకాణం ముందు ప్రజలు భౌతిక దూరం పాటించకపోతే, ప్రభుత్వం సదరు దుకాణాన్ని మూసేయిస్తుంది. మనమంతా కరోనాను ఓడించాలి. అందుకోసం ప్రజలంతా మాస్కులు ధరించి, భౌతిక దూరం తప్పక పాటిస్తూ, చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి అని కోరారు.
ఇదీ చదవండి:మద్యం దుకాణాల ఎదుట మందుబాబుల హడావుడి