'సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే వరకు వేచి ఉంటాం' కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప. అంతర్గత కలహాలతోనే సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. అప్పటి వరకూ భాజపా వేచి చూస్తుందని స్పష్టం చేశారు.
" ఎన్నికలకు వెళ్లాలని మాకు ఎలాంటి ఆలోచన లేదు. వారు (కాంగ్రెస్-జేడీఎస్) ఒకరినొకరు కలహించుకొనే ఇంటికి వెళతారు. మేము వేచి ఉంటాం. మాకు 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మా ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వం పడిపోతుందనే భావిస్తున్నారు. శాసనసభ రద్దు, ఇతర అంశాలపై ప్రస్తుతం మాట్లాడాల్సిన అవసరం లేదు. "
- యడ్యూరప్ప, కర్ణాటక రాష్ట్ర భాజపా అధ్యక్షుడు
కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం సమర్థంగా పని చేయాలి లేదా రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవాలని యడ్యూరప్ప పేర్కొన్నారు. దానికి బదులుగా గందరగోళం సృష్టించటం, దోపిడి చేసే పనిలో మునిగిపోతే ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పారు.
లోక్సభ ఎన్నికల్లో భాజపా పనితీరుపై ప్రశంసలు కురిపించారు యడ్యూరప్ప. అధికార కూటమి రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళితే భాజపాకే లాభం చేకూరుతుందన్నారు.
లోక్సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఘోరంగా విఫలమైంది. రెండు పార్టీలకు చెరో సీటు మాత్రమే వచ్చింది. కూటమి సభ్యుల్లో అసంతృప్తి పెరిగిపోయింది. తమ ఎమ్మెల్యేలను భాజపా అక్రమంగా లాక్కుంటుందనే భయం పట్టుకుంది. లోక్సభ ఎన్నికల్లో 28 సీట్లకు గాను భాజపా 25 స్థానాల్లో విజయం సాధించింది.
ఇదీ చూండండి:కాంగ్రెస్ నేతల్లో అసమ్మతి.. కన్నడనాట ఉత్కంఠ