దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తామని చెబుతున్నారు కేంద్ర మంత్రులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీలు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అత్యున్నతంగా పని చేస్తామని అన్నారు లోక్ జనశక్తి పార్టీ అధినేత రాం విలాస్ పాసవాన్. శాఖలు కేటాయించిన తర్వాత తదుపరి ప్రణాళికను మీడియాకు తెలియజేస్తామని తెలిపారు.
దేశ సేవకు తన సామర్థ్యం మేరకు కృషి చేస్తానని చెప్పారు కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనురాగ్ ఠాకూర్.
కేబినెట్లో ఒడిశా నుంచి ఇద్దరికి చోటు దక్కడం కీలక పరిణామం అన్నారు ధర్మేంద్ర ప్రధాన్. ఇదే రాష్టం నుంచి అవకాశం పొందిన మరో కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రులుగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన 36 మందిలో రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్, ప్రకాశ్ జావడేకర్ ఉన్నారు. అమిత్ షాతో పాటు మరో 20 మందికి మంత్రిమండలిలో మొదటి సారి అవకాశం దక్కింది.
నరేంద్ర మోదీ సహా 58 మంది గురువారం కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ ఎదుట అట్టహాసంగా కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చూడండి: నమో 2.0: కొత్త సర్కారుకు సవాళ్ల స్వాగతం