రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. అందుకు అనుగుణంగా ప్రజాకర్షణ మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. తాజాగా తమిళనాడులో డీఎంకే పార్టీ కూడా ఇదే దారిలో అడుగేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, యువతను ఆకర్షించే విధంగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తమిళనాడులో అన్ని ప్రధాన పార్టీలు, విద్యార్థులు వ్యతిరేకించిన 'నీట్' ప్రవేశ పరీక్షను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పిస్తామని డీఎంకే అధినేత స్టాలిన్ ప్రకటించారు.
" రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఫించను పథకం బదులు పాత ఫించను పద్ధతిని అమలు చేస్తాం. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ ధరల్లో నియంత్రణ తెచ్చేలా విధాన ధరను ప్రవేశ పెడతాం. అన్ని రకాల విద్యా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తాం. వినియోగదారులకు ఎల్పీజీ సబ్సిడీ మొత్తాన్ని నగదుగా అందిస్తాం. గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గిస్తాం."
- స్టాలిన్, డీఎంకే అధినేత