తెలంగాణ

telangana

ETV Bharat / bharat

''మహా'లో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం'

శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంపై తొలిసారి బహిరంగ ప్రకటన చేసింది కాంగ్రెస్​-ఎన్సీపీ కూటమి. ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​ నివాసంలో ఇరుపార్టీల ముఖ్యనేతల సమావేశం అనంతరం రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్​. 3 పార్టీలు కలిసి రాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని పేర్కొంది ఎన్సీపీ. ముఖ్యమంత్రి పదవిని రొటేషనల్​ పద్ధతిలో పంచుకోనున్నట్లు ఎన్సీపీ వర్గాల సమాచారం.

''మహా'లో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం'

By

Published : Nov 20, 2019, 11:06 PM IST

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో శివసేనతో చేతులు కలిపే విషయంపై స్పష్టమైన సూచన చేసింది కాంగ్రెస్​-ఎన్సీపీ కూటమి. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత పృథ్వీరాజ్​ చవాన్​. ఆయన మాటతో శివసేనతో జట్టుకట్టే విషయం మరింత బలపరిచినట్లయింది.

దిల్లీలోని శరద్​ పవార్​ నివాసంలో కాంగ్రెస్​-ఎన్సీపీ ముఖ్యనేతల సుదీర్ఘ​ సమావేశం అనంతరం కీలక ప్రకటన చేశాయి ఇరు పార్టీలు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి త్వరలోనే ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు చవాన్​. సేనతో చేతులు కలపాల్సిన అవసరాన్ని నిస్సందేహంగా వెల్లడించారు ఎన్​సీపీ ప్రతినిధి నవాబ్​ మాలిక్​. మూడు పార్టీలు కలిసి రాకుండా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఏర్పాటులో సేనతో చేతులు కలిపే విషయంలో వారి ఉద్దేశంపై కాంగ్రెస్​-ఎన్సీపీ చేసిన బహిరంగ ప్రకటన ఇది. శివసేనకు కాంగ్రెస్​ మద్దతు ఇస్తుందా అనే సందేహాలకు ఈ ప్రకటనతో ముగింపు పలికినట్లయింది.

రొటేషనల్​ పద్ధతిలో..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి రొటేషనల్​ పద్ధతిలో ఉండనుందని ఎన్సీపీ వర్గాల సమాచారం. తొలి సగంలో శివసేన, రెండో అర్ధభాగం నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ అధికారం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. పూర్తి ఐదేళ్ల కాలానికి ఉప ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్​ తీసుకోనున్నట్లు సమాచారం.

శివసేన నుంచే ముఖ్యమంత్రి..

మూడు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఆ ప్రక్రియ సుదీర్ఘంగా ఉంటుందన్నారు శివసేన నేత సంజయ్​ రౌత్​. ఈ కసరత్తును నేడు ప్రారంభించినట్లు తెలిపారు. 2-5 రోజుల్లో పూర్తి చేసుకుని రాష్ట్రంలో ప్రభుతాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. శివసేన నుంచే ముఖ్యమంత్రి ఉండాలన్నది మహారాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. ఉద్ధవ్​ ఠాక్రే నేతృత్వంలో ప్రభుత్వం ఉండాలన్నేది అందరి భావనగా పేర్కొన్నారు.

ఇదీ చూడండి: చిట్​ఫండ్​ చట్ట సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details