కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిల్లీ అల్లర్లకు పాల్పడ్డ ఏ ఒక్కరినీ వదలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. ఇందుకు కుల, మత, పార్టీలు అతీతం కాదని స్పష్టం చేశారు. హింసాత్మక ఘటనలకు పాల్పడే వారిపై చేపట్టే చర్యలు దేశానికి ఒక గుణపాఠంగా మారతాయన్నారు.
దిల్లీ అల్లర్లపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టిన సందర్భంగా లోక్‌సభలో ఈ మేరకు స్పందించారు షా. ముందస్తుగా చేసిన కుట్రలో భాగంగానే అల్లర్లు చెలరేగాయని ఆరోపించారు. దిల్లీ పోలీసులపై విపక్షాలు చేసిన ఆరోపణలను ఖండించారు షా. హింసాత్మక ఘటనలు వ్యాప్తి చెందకుండా పోలీసులు అరికట్టారని కొనియాడారు.
"ఫిబ్రవరి 25 అర్ధరాత్రి తర్వాత ఒక్క హింసాత్మక ఘటన కూడా జరగలేదు. ఏ ఒక్క పోలీసు అధికారిని నేను ఆపలేదు. ఘటనాస్థలంలో పోలీసులు చర్యలు చేపట్టారు. అల్లర్లను ఆపేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు విచారణ జరిపి.. నిజానిజాలను కోర్టు ముందుకు తీసుకుని వెళ్తారు. 36 గంటల పాటు తీవ్రంగా శ్రమించి అల్లర్లను అరికట్టింది పోలీసులే. ఒక సంఘానికి చెందిన వారే ఈ పని చేశారని ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. నిర్దోషులను పట్టుకోవద్దని తెలిపారు. ఓవైసీ సాబ్.. మేము ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చాం. దానికి మతం తెలియదు. దుస్తులను చూడదు. ఎవరైతే అల్లర్లకు పాల్పడ్డారో.. వారి మొఖాన్ని మాత్రమే చూసి.. కచ్చితంగా గుర్తిస్తుంది. ఆ సాఫ్ట్‌వేర్‌లో ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారాన్ని నిక్షిప్తం చేశాం. ఇప్పటి వరకు 1100 మందికిపైగా గుర్తించాం. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి 300 మంది వచ్చి అల్లర్లు సృష్టించారు. యూపీ నుంచీ సమాచారం తీసుకున్నాం. ఎవ్వరైనా సరే అల్లర్లకు మద్దతు ఇచ్చినా, చట్టాన్ని ఉల్లంఘించినట్టు తెలిసినా.. వారు ఇక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా దాటి వెళ్లలేరు."
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.
ఇప్పటి వరకు 2,647 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు కేంద్ర హోంమంత్రి. దిల్లీ పోలీసుల్లో ధైర్యం నింపేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్.. తన సూచన మేరకు ఈశాన్య దిల్లీలో పర్యటించినట్లు వివరించారు.