''రేప్' వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాల్సింది మోదీనే' 'మేక్ ఇన్ ఇండియా'ను 'రేప్ ఇన్ ఇండియాగా' అభివర్ణించిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పేది లేదన్నారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. యూపీఏ హయాంలో దిల్లీ 'రేప్ క్యాపిటల్'గా మారిందని గతంలో ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారని... ఆ వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న హింస నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే తన వ్యాఖ్యలపై భాజపా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు రాహుల్.
"భాజపా, మోదీ, అమిత్ షా ఈశాన్య రాష్ట్రాల్లో నిప్పు పెట్టారు. ఈ అంశం నుంచి తప్పించుకునేందుకు మోదీ, భాజపా నేతలు నాపై విమర్శలు చేస్తున్నారు. నేను ఏమన్నానో మరోసారి చెప్తాను. దేశం మేక్ ఇన్ ఇండియా అవుతుందని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పుడు ఒకసారి పరిస్థితులు చూస్తే దేశమంతా రేప్ ఇన్ ఇండియాగా మారింది. ఒక్క రాష్ట్రమని లేదు. భాజపా పాలిత రాష్ట్రాల్లోనూ ప్రతి రోజూ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
ఈశాన్య రాష్ట్రాల్లో నిప్పు రాజేసినందుకు, దేశ ఆర్థికవ్యవస్థను నాశనం చేసినందుకు మోదీ క్షమాపణలు చెప్పాలని ట్వీట్ చేస్తూ గతంలో ప్రధాని మాట్లాడిన ఓ వీడియో క్లిప్‌ను జోడించారు రాహుల్.