మధ్యప్రదేశ్‌లో 'కమల్' సర్కార్ బలపరీక్షకు వేళాయే..! మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ సర్కారు భవితవ్యం అయోమయంలో పడింది. జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 22మంది ఎమ్మెల్యేలు మంగళవారం రాజీనామా చేసినందున ప్రభుత్వ మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయి. సింధియాను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన ప్రయత్నాలు విఫలమవడం సహా భాజపా అధ్యక్షుడు నడ్డాతోపాటు ప్రధాని మోదీ, అమిత్ షాతో భేటీ అయినందున సింధియాపై కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు వేసింది.
బలపరీక్ష జరగొచ్చేమో..!
22మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో బలపరీక్ష జరగొచ్చన్న అంచనాల మధ్య కాంగ్రెస్, భాజపాలు అప్రమత్తమయ్యాయి. ఇరుపార్టీలు నిన్న శాసనసభాపక్ష భేటీలు నిర్వహించాయి. కాంగ్రెస్ సమావేశానికి వందమంది ఎమ్మెల్యేలతోపాటు నలుగురు స్వతంత్రులు సైతం హాజరుకాగా.. 22మంది రెబెల్ ఎమ్మెల్యేలతోపాటు ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే ఈ భేటీకి దూరంగా ఉన్నట్లు సమాచారం. తిరుగుబాటు ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు సజ్జన్‌సింగ్ వర్మ, గోవింద్ సింగ్‌లను బెంగళూరు పంపిన కాంగ్రెస్.. ముందస్తు జాగ్రత్తగా తమ సభ్యులను ఇవాళ జయపుర తరలించనుంది. భాజపా సైతం తమ ఎమ్మెల్యేలను గురుగ్రామ్‌లోని ఐటీసీ గ్రాండ్ భారత్‌లో ఉంచింది.
కేంద్రంలో సింధియా.. రాష్ట్రంలో చౌహాన్
230స్థానాలున్న మధ్యప్రదేశ్ శాసనభలో ఇప్పటికే రెండు ఖాళీలు ఉండగా 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే సభ్యుల సంఖ్య 206కు తగ్గుతుంది. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 104మంది అవుతుంది. ప్రస్తుతం భాజపాకు 107మంది సభ్యుల బలం ఉంది. కమలదళం అనుకున్నట్లు అన్ని సవ్యంగా జరిగితే శివరాజ్‌సింగ్ చౌహాన్ మరోసారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కాషాయ దళంలో చేరనున్న సింధియాకు రాజ్యసభ సభ్యత్వంతోపాటు కేంద్ర మంత్రి పదవి దక్కనుందనే ప్రచారం జరుగుతోంది.