గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై సిక్కుల జెండా ఎగురవేసిన ఘటనతో సంబంధమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్ నటుడు దీప్ సిద్దూ.. తాను పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతానని తెలిపాడు. అయితే కొన్ని నిజాలు బయటకు తీయాల్సి ఉందని, ఆ తర్వాతే విచారణకు హాజరవుతానని చెప్పాడు. ఈ అంశంలో తాను ఏ తప్పు చేయలేదని అన్నాడు. ఈ మేరకు ఫేస్బుక్ ద్వారా ఓ వీడియోను పంచుకున్నాడు దీప్.
"నాపై అరెస్టు వారెంట్, లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. నేను విచారణకు హాజరువుతానని ముందు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నా మీద వస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తవాలే. వాటితో ప్రజలు తప్పుదోవ పడుతున్నారు. ఇందులో నిజాలను వెలికితీసేందుకు రెండు రోజుల సమయం కావాలి. ఆ తర్వాతే నేను విచారణకు హాజరతాను. నిఘా సంస్థలను నేను వేడుకుంటున్నా. నేను ఏ తప్పూ చేయలేదు. అలాంటప్పుడు నేను ఎందుకు పారిపోవాలి? ఎందుకు భయపడాలి? ఈ విషయంలో నిజానిజాలు బయటకు వస్తాయి. "
- దీప్ సిద్ధూ, పంజాబీ నటుడు
ట్రాక్టర్ ర్యాలీ హింస ఘటనలో దీప్ సిద్ధూపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దిల్లీ పోలీసులు. ఆయనతో పాటు మాజీ గ్యాంగ్స్టర్ లఖా సిధానా, సామాజికవేత్త మేధా పాట్కర్, 37 మంది రైతు నేతలపై ఎఫ్ఐర్ దాఖలు చేశారు.