తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పనన్న సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనపై పునరాలోచించుకునేందుకు సుప్రీంకోర్టు రెండు రోజులు గడువునిచ్చింది. ఈ నేపథ్యంలో తన న్యాయవాదులను సంప్రదించి అత్యున్నత న్యాయస్థానం సూచనపై చర్చిస్తానని భూషణ్ వెల్లడించారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కోర్టులపై ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లను కోర్టు ధిక్కరణగా భావించి సర్వోన్నత న్యాయస్థానం కేసును సుమోటోగా స్వీకరించింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ప్రశాంత్ భూషణ్‌ను ఈ నెల 14న దోషిగా తేల్చింది.
తాజా విచారణలో భాగంగా.. ప్రశాంత్ భూషణ్‌కు ఎలాంటి శిక్ష విధించవద్దని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ప్రశాంత్ భూషణ్ తన వైఖరిని మార్చుకోకపోతే శిక్ష విధించక తప్పదని స్పష్టం చేసింది. అయితే ఇచ్చిన గడువులోపు ఆయనకు ఎలాంటి శిక్ష విధించబోమని పేర్కొంది.