ఊహించని పరిణామాల మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేసిన భాజపాను స్పీకర్ ఎన్నిక సమయంలోనే ఓడిస్తామని పేర్కొంది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ). పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నట్లు స్పష్టం చేసింది.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో ముంబయి వైబీ చవాన్ కేంద్రంలో పార్టీ శాసనసభ్యులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మినహా.. మిగతావారంతా తమతోనే ఉన్నారని తెలిపారు పార్టీ ప్రతినిధి, సీనియర్ నేత నవాబ్ మాలిక్.
"ప్రభుత్వానికి నవంబర్ 30 వరకు గడువు ఇచ్చారు. వారిని మేము స్పీకర్ ఎన్నికలోనే ఓడిస్తాం. అనంతరం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కచ్చితంగా చెప్పగలను. పార్టీకి చెందిన 54 మంది ఎమ్మెల్యేలలో ఐదుగురు మాత్రమే మాతో లేరు. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు ముంబయికి వస్తున్నారు. మిగతా 43 మంది శాసనసభ్యులు ముంబయిలోని ఓ హోటల్లో గడపనున్నారు."
- నవాబ్ మాలిక్, ఎన్సీపీ అధికార ప్రతినిధి