బిహార్‌లో పార్టీల కూటములకు అర్థాలు మారుతున్నాయి. సాధారణంగా కూటమి అంటే అందులో ఉన్న అన్ని పార్టీలతో మిగిలిన పక్షాలన్నింటికీ సంబంధాలు ఉండడం. అయితే ఇక్కడ మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. కూటమిలో ఉంటూనే ఒక పార్టీకి మద్దతుగా ఉండడం, మరో పార్టీని వ్యతిరేకించటమనే విధానం అమలవుతోంది. ప్రస్తుతం ఎన్డీఏలో ఇదే పరిస్థితి ఉందని లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ) అధ్యకుడు, లోక్‌సభ సభ్యుడు చిరాగ్ పాసవాన్ చెప్పారు. ఇది కూటమిలో కూటమి అని అభివర్ణించారు.
ఎన్డీఏలో జేడీ(యూ), భాజపా, ఎల్జేపీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ కూటమే అధికారంలో కొనసాగుతోంది. అయితే జేడీ(యూ), ఎల్జేపీల మధ్య సంబంధాలు లేవు. ఎల్జేపీతో తాము ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదని జేడీ(యూ) చెబుతోంది. మరోవైపు నితీశ్ ప్రభుత్వంపై ఎల్జేపీ విమర్శలు చేస్తూనే ఉంది.
"రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతునే ఉంటాం. ప్రభుత్వం పని తీరు బాగాలేదు. ఎక్కడ శ్రద్ధ పెట్టాలో చెబుతూనే ఉంటాం. ఎన్డీఏ కూటమిలో తమ పార్టీ అయిన ఎల్జేపీ లేదని జేడీ(యూ) ప్రచారం చేస్తోంది. దీనిపై ఈనెల 16న జరిగే పార్టీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం."
- చిరాగ్ పాసవాన్, ఎల్జేపీ అధ్యక్షుడు