కన్నడ రాజకీయం మలుపులు తిరుగుతూనే ఉంది. అంతా ముగిసిపోయింది అనుకున్న వేళ.. యడియూరప్ప బలనిరూపణకు సిద్ధమవడం..., 17 మంది రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడం కన్నడ రాజకీయంపై ఆసక్తి రేకెత్తిస్తోంది.
కర్ణాటకం సశేషం.. మళ్లీ సుప్రీం ముందుకు రెబల్స్!
దేశం మొత్తాన్ని కళ్లు తిప్పుకోనివ్వకుండా... మునివేళ్లపై నిల్చోబెట్టింది కన్నడ రాజకీయం. కుమారస్వామి సర్కారు కూలిపోయింది. యడియూరప్ప ప్రమాణస్వీకారం అయిపోయింది. కానీ కర్ణాటకీయం సశేషంగానే ఉంది. 14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంలో సవాలు చేసేందుకు తిరుగుబాటు శాసనసభ్యులు సిద్ధమయ్యారు.
మొన్న ముగ్గురు అసంతృప్త ఎమ్మెల్యేలపై వేటు వేసిన కన్నడ సభాపతి... నేడు మరో 14 మంది తిరుగుబాటు శాసనసభ్యులపై అనర్హత వేటు వేశారు. ఈ నిర్ణయంపై ఆగ్రహించిన రెబల్స్.. స్పీకర్ నిర్ణయం చర్య విరుద్ధమని, సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.
"ఈ అనర్హత వేటు చట్ట విరుద్ధం. కేవలం ఒక విప్ జారీ చేసి.. శాసనసభ్యులను సభకు బలవంతంగా తీసుకురాలేరు. సభకు రాలేదనే కారణంతో ఇప్పటికే 20 మంది ఎమ్మెల్యేలపై సభాపతి వేటు వేశారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని సోమావారం ఆశ్రయిస్తాం."
- ఎహెచ్ విశ్వనాథ్, రెబల్ ఎమ్మెల్యే