తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా కాలంలో మలేరియా మందు మర్మమిదే! - హైడ్రాక్సీ క్లోరో క్విన్

మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై ప్రపంచమంతా నమ్మకంగా ఉంది. కరోనా బాధితులను రక్షించుకోవడానికి అమెరికా, బ్రెజిల్‌తోపాటు 30 వరకు దేశాలు మాకంటే మాకు అంటూ ఈ ఔషధాన్ని పంపించాలని భారత్‌ను కోరుతున్నాయి. అది మన దగ్గరే ఎందుకు ఎక్కువగా లభిస్తోంది? వైరస్‌ను ఎంతవరకు నిలువరిస్తుంది? వేరే దేశాలకు ఇస్తే మనకు ఎలా? ప్రస్తుత ఉత్పత్తి పరిస్థితి ఏమిటి? కొవిడ్‌పై ఇదే మందుతో ఎక్కడైనా ప్రయోగాలు చేస్తున్నారా? తెలుసుకుందాం..

malaria drug
మలేరియా మందు

By

Published : Apr 16, 2020, 6:21 AM IST

ప్రపంచాన్ని కరోనా వణికిస్తోన్న వేళ ప్రపంచమంతా భారత్​వైపు చూస్తోంది. కారణం.. మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మన దగ్గర ఎక్కువగా లభించటమే. తమ దేశ ప్రజలను కరోనా నుంచి రక్షించుకోవటానికి ఈ ఔషధం కోసం భారత్​ను అమెరికా, బ్రెజిల్ సహా 30 దేశాలు అభ్యర్థిస్తున్నాయి. అసలు ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్​ మన దగ్గర అధికంగా లభించేందుకు కారణాలేంటో చూద్దాం.

చెట్టు బెరడే ఆధారం

ప్రపంచంలోని ఎన్నో దేశాలను మృతుల దిబ్బగా మార్చేసిన స్పానిష్‌ ఇన్‌ఫ్లూయంజా(1918) తర్వాత మానవాళిపై 1928 సంవత్సరం నుంచి మలేరియా రూపంలో మరో మహమ్మారి దాడిచేసింది. దీనికి దక్షిణ అమెరికాలోని సించోనా అనే చెట్ల బెరడును మందుగా వాడేవారు. దాన్ని క్వినైన్‌ అని పిలిచేవారు.

మలేరియా 1930 సంవత్సరాంతానికి అనేక దేశాలకు వ్యాపించడం వల్ల మందును భారీ ఎత్తున తయారుచేశారు. దానికి క్లోరోక్విన్‌గా పేరు పెట్టారు. ఈ మందుతో కొన్ని ప్రతికూలతలు వస్తున్నట్లు గుర్తించారు. 1950లో మరింత మెరుగుపరిచి, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తయారుచేశారు. ఈ ఔషధాన్ని మలేరియా, కీళ్లనొప్పులు, ఆటో ఇమ్యూన్‌తో వచ్చే లూపస్‌ వంటి వాటికి వాడుతున్నారు.

అక్కడ మలేరియా తక్కువ

అభివృద్ధి చెందిన దేశాల్లో మలేరియా చాలా తక్కువ. అందుకే వాటిలో 1980 నుంచే క్రమంగా మందు తయారీని ఆపేశారు. దీని ధర కూడా తక్కువగా ఉండటం వల్ల ఫార్మా కంపెనీలకు లాభాలూ రావు. ఈ కారణంగా అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాలు దిగుమతులపై ఆధారపడుతున్నాయి.

ప్రపంచ ఉత్పత్తిలో 70% మన వద్దే

అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాల్లో మలేరియా కేసులు ఎక్కువ. గ్రామాలు అధికంగా ఉన్న దేశాల్లో మరీ ఎక్కువ. ఫలితం భారత్‌, చైనా దేశాల్లో ఈ మందు భారీగా తయారవుతోంది. ప్రపంచంలోని 70% హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ అవసరాలను మనదేశమే తీరుస్తోంది. దీని తయారీకి వాడే యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియంట్‌ (ఏపీఐ- ముడిసరకు)ను మాత్రం అత్యధికంగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం.

ఎంత ఉత్పత్తి చేస్తున్నారు

మన ఫార్మా కంపెనీలు నెలకు 20 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మందు బిళ్ల(200 మిల్లీ గ్రాములు)లను ఉత్పత్తి చేయగలవు. ఏడాదికి 2.40 కోట్ల బిళ్లలు మన దేశ అవసరాలకు సరిపోతాయి. ప్రస్తుత గిరాకీ నేపథ్యంలో ఉత్పత్తిని 3-4 రెట్లు పెంచుతున్నారు.

అమెరికాలో దీనికి 128వ స్థానం

అమెరికాలో మలేరియా కేసులు అతి తక్కువ. ఫలితంగా ఔషధ నిల్వలు లేవు. అక్కడి వైద్యులు సిఫారసు చేసే మందుల్లో దీనిది 128వ స్థానం.

పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే...!

కొవిడ్‌పై హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఫలితాలు ఒక్కోదేశంలో ఒక్కోలా ఉంటున్నాయి. స్వీడన్‌లో వాడగా ప్రతి 100 మందిలో ఒకరికి గుండె, మూత్రపిండాలపై దుష్ప్రభావం చూపుతున్నట్లు తేలింది. ఇవే కారణాలతో "15 సంవత్సరాలలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన పెద్దలకు ఈ మందు ఇవ్వకూడదు" టూ భారత్‌లోనూ ఐసీఎంఆర్‌ ఆదేశించింది.

అయితే అమెరికాలో చేసిన పరిశోధనలో సానుకూల ఫలితాలు వచ్చినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చైనా, ఫ్రాన్స్‌లలోనూ అనుకూల ఫలితాలే వచ్చాయి. బ్రిటన్‌, ఆస్ట్రేలియాల్లోనూ పరిశోధనలు కొనసాగుతున్నాయి. భారత్‌లోనూ సమస్య తీవ్రంగా ఉన్న బాధితులకు అజిత్రోమైసిన్‌తో కలిపి దీన్ని వాడుతున్నారు. వ్యాధి చికిత్సలో పాల్గొనే వైద్యులు, సిబ్బందికీ ముందు జాగ్రత్తగా ఇస్తున్నారు.

భారత్‌లో ఎందరికి ఎన్ని కావాలంటే...

ఫార్మా నిపుణుల ప్రకారం... 14 మందు బిళ్లలను ఒక కోర్సుగా పరిగణిస్తారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ముందుజాగ్రత్తగా 71 లక్షల మందికి సరిపడా నిల్వ చేయడానికి 10 కోట్ల బిళ్లలను ఉత్పత్తి చేయాలని కంపెనీలకు ఆర్డర్‌ ఇచ్చింది.

ఇదీ చూడండి:వ్యాక్సిన్ తయారీలో అగ్రరాజ్యాలతో భారత సంస్థల పోటీ

ABOUT THE AUTHOR

...view details