శాస్త్ర సాంకేతికత, ఆధునికతకు మహాత్మాగాంధీ వ్యతిరేకమని సాధారణంగా భావిస్తుంటారు. అలా అయితే గాంధీని తప్పుగా అర్థం చేసుకున్నట్లే. ఎందుకంటే గాంధీ రచనలకు ఇప్పటివరకు సరిగా అవగాహన చేసుకోలేకపోయారు. ప్రస్తుత పరిశోధక ప్రపంచ నూతన ఆవిష్కరణలు, సమగ్ర అధ్యయనాలు గాంధీ ఆయన కాలంలో చేసిన ప్రయోగాలకు దగ్గరగా ఉన్నాయి. ఉదాహరణకు గాంధీ ఆత్మకథలో పద విజ్ఞానమే కాదు.. పద ప్రయోగాలూ అనేకం ఉంటాయి.
కానీ.. గాంధీ సైన్స్ వ్యతిరేకి అన్న అపోహకు చాలా కారణాలు ఉన్నాయి. ఆయన సాహిత్యానికి సంబంధించి సంపూర్ణ అధ్యయనం జరగలేదు. 2,3 దశాబ్దాలుగా గాంధీ సైన్స్ పరిధులను అన్వేషించడానికి ప్రపంచవ్యాప్తంగా కొంతమేర ప్రయత్నాలు జరిగాయి. ప్రారంభంలో గాంధీ రచనలు ఎక్కువగా హింద్ స్వరాజ్ మీద ఆధారపడి ఉన్నాయి. కానీ ఇది 1909లో రాసింది. దీని ఆధారంగా ఆయన జీవితంలో చివరి 4 దశాబ్దాల్లో రచనలను కూడా విస్మరించారు. వాటిని పూర్తిగా అవగతం చేసుకుంటేనే ఆయన దృక్పథం తెలుస్తుంది.
ఆయన ఆలోచన విధానం చాలా భిన్నంగా ఉంటుంది. జీవరాశికి సంబంధం ఉన్న ప్రతి వస్తువులోనూ సైన్స్‌ను వెతుకుతారు. చరఖా నుంచి పళ్లను శుభ్రం చేసుకునే పుల్లలను కూడా యంత్రాలుగా భావించేవారు గాంధీ. మానవ శరీరం కూడా అద్భుతమైన యంత్రమని అనేవారు. అందుకే ఆయన సొంతంగా చాలా పనులు చేసుకునేవారు. అందుకే గాంధీని ఉద్దేశించి 1954లో అను బందోపాధ్యాయ రాసిన 'బహురూపి' పుస్తకానికి ముందుమాటలో పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఇలా రాశారు.
"ఇన్ని విషయాలపై ఇంతలా ఆసక్తి పెంచుకోవటం అసాధారణమైన విషయం. ఇదేం బాహ్య పరిశీలన కాదు. మానవ జీవితాల్లోని చిన్న విషయాల్లోనూ వాటి అంతులను స్పృశించారు. అదే ఆయనలోని గొప్పతనం."
-జవహర్ లాల్ నెహ్రూ, భారత తొలి ప్రధాని
ఒకసారి గాంధేయ సంస్థలైన బాంబే సర్వోదయ మండల్, గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్ వెబ్సైట్లను సమగ్రంగా పరిశీలిస్తే మరో విషయం కూడా తెలుస్తుంది. అందులో శంభుప్రసాద్ రాసిన కథనం "టువార్డ్స్ యాన్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాంధీస్ వ్యూస్ ఆన్ సైన్స్"ను చదివితే అసలు విషయం బోధపడుతుంది. ఖాదీ ఉద్యమంతో గాంధీ సైన్స్ వ్యతిరేకి అని మొదటిసారిగా అల్డోస్ హక్స్లీ ముద్రవేశారని ఇందులో తెలిపారు. 1985 నుంచి విశ్వనాథన్, విశ్వాస్, ఉబెరాయి, సహస్రబుద్ధి వంటి పరిశోధకులు చెప్పిన సంగతుల ద్వారా గాంధీ ఆలోచనల గురించి సులభంగా అర్థం చేసుకోవచ్చు.
1904లో బ్రిటిష్ సైన్స్ సంఘం బృందం దక్షిణాఫ్రికా పర్యటించింది. ఆ సమయంలో వారితో మాట్లాడిన గాంధీ.. సంఘాన్ని బ్రిటిష్ సామ్రాజ్యానికి విస్తరించాలని కోరారు. ఈ మార్పు భారత్‌తో పాటు బ్రిటన్ పాలిస్తున్న అన్ని దేశాలకు లాభిస్తుందని అభిప్రాయపడ్డారు.
గురువు నుంచి శిష్యునికి విజ్ఞానం సరళంగా బదిలీ కావాలనేవారు గాంధీ. అప్పుడే సైన్స్ నుంచి సరైన ప్రయోజనం పొందగలరని ఆయన అన్నారు. అహింసా మార్గంలోనే సైన్స్ ఉపయోగపడాలన్నారు. ఈ విధంగా శాస్త్రవేత్తల్లో ధైర్యం, స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నించారు. పాశ్చాత్య శాస్త్రీయ విషయానికి వస్తే అల్ఫ్రెడ్ వాలెస్ మాటలను ఉటంకిస్తూ దాని నైతిక స్వభావాన్ని ఆయన రచనల్లో విమర్శించారు.