మహారాష్ట్రలో 'చెరిసగం పదవి' ప్రతిపాదనపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ భాజపాపై విమర్శలు చేస్తూనే ఉంది శివసేన. ఆ పార్టీ అధికారిక పత్రిక 'సామ్నా'లో ప్రచురితమైన సంపాదకీయంలో కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. షోలే సినిమాలో ప్రేక్షకులను కంటతడి పెట్టించిన డైలాగ్‌ను భాజపాపై ప్రయోగించింది శివసేన.
షోలే చిత్రంలో ఓ అంధుడి కుమారుడ్ని గబ్బర్‌సింగ్ చంపి గ్రామానికి తీసుకొచ్చి పడేస్తాడు. ఈ విషయాన్ని ఆ అంధునికి చెప్పలేక గ్రామస్థులు మౌనంగా రోదిస్తారు. ఏ జరిగిందో అర్థం కాక అంధుని పాత్ర వేసిన హంగల్ "ఇత్నా సన్నాటా క్యూ హై భాయ్"(ఇంత మౌనంగా ఎందుకు ఉన్నారు సోదరా) అని దీనంగా అడికే సన్నివేశం అందరినీ కంటతడి పెట్టిస్తుంది.
దేశ ఆర్థిక వ్యవస్థ తీరును విమర్శిస్తూ ఇలాగే దీనంగా ప్రశ్నించింది సామ్నా. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంటే మౌనంగా ఎందుకున్నారంటూ దిగాలుగా అడిగింది ఠాక్రేల పత్రిక.
"అమ్మకాల గణాంకాలు తగ్గడం వల్ల మార్కెట్లు కళ తప్పాయి. మాంద్యం భయాలతో కొన్ని పరిశ్రమలు 30 నుంచి 40 శాతం వరకు నష్టపోయాయి. మరికొన్ని మూతపడ్డాయి. ఈ పరిస్థితి నిరుద్యోగానికి దారితీస్తోంది.