భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తతల్లో అమరులైన సైనికులకు సంఘీభావం ప్రకటిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు వ్యక్తం చేశారు. చైనా పేరును ప్రస్తావించకుండా భారత సైన్యాన్ని అవమానించారని మండిపడ్డారు.
సైనికుల మరణానికి నివాళి అర్పించేందుకు ఎందుకు రెండురోజుల సమయం పట్టిందని ప్రశ్నించారు. ఓవైపు సైనికులు అమరులవుతున్నా... ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడంపై విచారం వ్యక్తం చేశారు.
"మీ(రాజ్నాథ్నుద్దేశించి) ట్వీట్లో చైనా పేరు ప్రస్తావించకుండా భారత సైన్యాన్ని ఎందుకు అవమానించారు. మృతులకు సంతాపం తెలిపేందుకు రెండు రోజులు ఎందుకుపట్టింది? జవానులు మరణిస్తున్నా ఎన్నికల ర్యాలీల్లో ఎందుకు పాల్గొన్నారు? పరిస్థితి నుంచి తప్పించుకొని ఆప్తులైన వార్తా సంస్థల ద్వారా ఆర్మీపై నిందలు మోపుతున్నారు? డబ్బులు తీసుకొని వార్తలు ప్రసారం చేసే ఈ మీడియా సంస్థలు ప్రభుత్వానికి బదులుగా సైన్యాన్ని ఎందుకు నిందించాలి?"
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా సైతం ఈ విషయంలో రాజ్‌నాథ్‌పై ధ్వజమెత్తారు. చైనాను ట్వీట్లో ప్రస్తావించడానికి అంత భయమెందుకని ప్రశ్నించారు.
"చైనా పేరును ప్రస్తావించడంలో భయమెందుకు? మన సైనికులు ఎంతమంది మరణించారు? చైనీయులు మన సైన్యాన్ని అపహరించారా? తప్పుదారి పట్టించకుండా దేశం ముందుకొచ్చి సమాధానాలు చెప్పండి."