తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆకలి కేకలు ఆగేదెన్నడు? ప్రపంచ సూచీలో వెనకబాటు - ప్రపంచ ఆకలి సూచీ-2019

దేశంలో ఆకలి కేకలు ఇంకా వినబడుతూనే ఉన్నాయి. అన్నార్తుల కష్టాలు ఆగిపోయే పరిస్థితులు ఇప్పట్లో కనపడటం లేదు. 117 దేశాల ప్రపంచ ఆకలి సూచీ(2019) జాబితాలో భారత్‌ 102వ స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనం. పౌష్టికాహార లోపం, అయిదేళ్లలోపు వయసు పిల్లల మరణాలు, పిల్లల్లో ఎదుగుదల లోపం (వయసుకు తగిన బరువు, ఎత్తు ఉండకపోవడం) తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని లెక్కించే ఈ సూచీలో భారత్‌ స్థానం ఏటికేడు దిగజారిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఆకలి కేకలు ఆగేదెన్నడు? ప్రపంచ సూచీలో వెనకబాటు

By

Published : Nov 16, 2019, 11:06 AM IST

దేశంలో పేదరికం తగ్గుతోందని, తొమ్మిదో దశకం నుంచి ఇప్పటివరకు సగానికి సగం మేర తగ్గిందని ఇటీవలే అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్‌) వార్షిక సమావేశం సందర్భంగా ప్రపంచ బ్యాంకు వ్యాఖ్యానించింది. అయినప్పటికీ ఆకలికేకలు ఆగకపోగా, గడచిన మూడేళ్లుగా పెరుగుతూ వస్తున్నాయి. 117 దేశాల ప్రపంచ ఆకలి సూచీ జాబితాలో భారత్​ ఏకంగా 102వ స్థానంలో నిలివడమే ఇందుకు నిదర్శనంగా ఉంది. ఆకలి సూచీలో పొరుగు దేశాలు పాకిస్థాన్‌ 94, బంగ్లాదేశ్‌ 88, నేపాల్‌ 73, మియన్మార్‌ 69, శ్రీలంక 66వ స్థానాల్లో ఉండటం గమనార్హం.

జనాభా వృద్ధే కారణమా...?

భారత్‌లో ఆకలి కేకలకు జనాభా వృద్ధి కారణమని ప్రపంచ ఆకలి సూచీ అధ్యయనం చెబుతోంది. అదే నిజమైతే ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల చైనా 25వ స్థానంలో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. ఐక్యరాజ్య సమితికి చెందిన వ్యవసాయం, ఆహార విభాగం నిరుటి అధ్యయనంలోనూ ఆహారభద్రత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది. అనూహ్య వాతావరణ మార్పులు, భూతాపం అధికం కావడం వల్ల భారత్‌తో సహా దక్షిణాసియా దేశాల్లో వ్యవసాయ ఉత్పత్తులు సగానికి సగం తగ్గిపోతాయని ప్రపంచ బ్యాంకు నివేదిక హెచ్చరిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా సుస్థిరాభివృద్ధి సాధనలో వాతావరణ మార్పులు, సంఘర్షణలే ప్రధాన అవరోధంగా నిలుస్తున్నాయన్నది వాస్తవం. జనాభా వృద్ధికి అనుగుణంగా పంటల సాగు విస్తీర్ణం ఇనుమడించకపోవడం, దిగుబడుల్లో వృద్ధి నమోదు కాకపోవడం, ఆహార ఉత్పత్తి, పంపిణీలో అంతరాలు కొనసాగుతుండటం వల్ల ఆహార కొరత ఏర్పడుతోంది. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం ప్రజలకు ప్రజా పంపిణీ విధానం ద్వారా సరఫరా అయ్యే ఆహార ధాన్యాలే ఆసరాగా ఉన్నాయి. అస్తవ్యస్తమైన ఆహారోత్పత్తుల పంపిణీ వల్ల అత్యధిక శాతం ప్రజానీకం ఆహార భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది.

ఆహార భద్రత చట్టం తెచ్చినప్పటికీ...

మధ్యాహ్న భోజనం, ఐసీడీఎస్‌, ప్రజా పంపిణీ వ్యవస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తూ 2013లోనే ఆహార భద్రత చట్టాన్ని తెచ్చినప్పటికీ రాష్ట్రాలు దాన్ని పూర్తిస్థాయిలో అమలు పరచడం లేదు. ఫలితంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఆహార ఉత్పత్తుల పంపిణీలో లొసుగులకు తోడు ఆహార ధాన్యాల నిల్వ, నిర్వహణ వ్యవస్థలోని లోపాలవల్ల ఏటా ఉత్పత్తవుతున్న ఆహార ధాన్యాల్లో మూడో వంతు నష్టపోవాల్సి వస్తోంది. ప్రకృతి విపత్తులు, పర్యావరణ సమస్యలు సైతం ఆహార భద్రతకు సవాలు విసరుతున్నాయి. వరదలు, కరవు కాటకాలు పంట నష్టానికి కారణమవుతున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో ఆకస్మికంగా కురిసే వర్షాలు అన్నదాతల పాలిట శాపంగా పరిణమిస్తున్నాయి. కరవు మూలంగా సేద్యయోగ్యమైన భూమిలో యాభైశాతానికైనా సాగునీరు అందడం లేదు. ఫలితంగా పంట భూములు బీడు వారుతున్నాయి. భూ వినియోగంలో మార్పుల కారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా కోసుకుపోతోంది. వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు ఇదే రీతిలో కొనసాగినట్లయితే భవిష్యత్తులో ప్రజల జీవన స్థితిగతులు, ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

గుప్పెడు మెతుకులకు నోచుకోవట్లేదు..

ఏటికేడు పేదరికం తగ్గిపోతోందంటూ ఆర్థిక గణాంకాలు పేర్కొంటున్నా గుప్పెడు మెతుకులకు నోచుకోని అభాగ్యులు, అన్నార్తులు పెరుగుతూనే ఉన్నారు. ప్రత్యేకించి మహిళలు, చిన్నారుల్ని పౌష్టికాహార లోపాలు కుంగదీస్తున్నాయి. 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసున్న మహిళల్లో దాదాపు సగం రక్తహీనతతో బాధపడుతున్నారు. తాజా ఆకలి సూచీ ప్రకారం 117 దేశాల్లో చిక్కిశల్యమవుతున్న పిల్లలు అధికంగా (20.8 శాతం) బక్కచిక్కిపోతున్నారు. 37.9 శాతం వయసుకు తగిన ఎత్తు, బరువు పెరగడంలేదు. తొమ్మిది నుంచి 23 నెలల వయసున్న వాళ్లకు మాత్రమే సరైన పౌష్టికాహారం అందుతున్నదంటే పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో అర్థమవుతుంది.

మున్ముందు కఠిన పరిస్థితులు..

పౌష్టికాహార లోపం, తాగునీరు, పారిశుద్ధ్య లోపం, అతిసారం, మలేరియా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, విష జ్వరాలు ప్రబలి ఎంతోమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆహార భద్రత విషయంలో మున్ముందు కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి. ప్రభుత్వాలు ఉపాధి కల్పన, ఆహార పథకాలు చేపడుతున్నప్పటికీ ప్రకృతి విపత్తులు, ఇతర సమస్యల వల్ల పౌష్టికాహార లోపాలు నేటికీ వెక్కిరిస్తూనే ఉన్నాయనేది నిష్ఠుర సత్యం.

సమగ్ర కార్యాచరణతోనే...

సమగ్ర మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయడం ద్వారా మహిళలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాల సమస్యను అధిగమించవచ్చు. 2022 నాటికల్లా పౌష్టికాహార లోపరహిత దేశంగా తీర్చిదిద్దాలంటే సమగ్ర కార్యాచరణ రూపొందించి, క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలుపరచాలి. ఆహారోత్పత్తుల దిగుబడి, పంపిణీ కోసం ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకుంటూ సుస్థిరాభివృద్ధి సాధన దిశగా అడుగులు వేయాలి. భూములను సరైన రీతిలో వినియోగించుకుని ఆహారోత్పత్తి పెంచేదిశగా చర్యలు చేపట్టడం అవసరం. వ్యవసాయ దిగుబడులను పెంచి, కొత్తరకాల పంటలు, విత్తనాల పంపిణీ, మార్కెటింగ్‌, గోదాముల వ్యవస్థలోని లోపాలను అధిగమించడానికి చర్యలు చేపట్టాలి. సురక్షిత తాగునీరు అందేలా, నీటి సంరక్షణ ఆవశ్యకతను తెలిపేలా ప్రచారోత్యమాన్ని చేపట్టడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. పర్యావరణాన్ని సంరక్షించుకోవడం ద్వారా ప్రకృతి విపత్తులను నియంత్రించవచ్చు. అప్పుడే దిగుబడులు మెరుగై ఆహారభద్రతకు పూచీ కల్పించినట్లవుతుంది. చిన్నారులు పౌష్టికాహార లోపాన్ని అధిగమించి ఆరోగ్యవంతమైన పౌరులుగా ఎదగగలరు.

- మనస్వి

ఇదీ చూడండి:మాయమవుతున్న మానవత్వం..?

ABOUT THE AUTHOR

...view details