అక్టోబర్ 20... నియంత్రణ రేఖ వెంట రక్తపాతం జరిగిన రోజు. తరచుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న దాయాది దేశం పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఎలాంటి కవ్వింపు లేకుండా ఆ దేశ సైన్యం జరుపుతున్న కాల్పులకు దిమ్మ తిరిగిపోయేలా బదులిచ్చింది. శతఘ్నిదళం పాకిస్థానీ స్థావరాలు, ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లు, గన్ పొజిషిన్లే లక్ష్యంగా విరుచుకుపడింది. మొత్తం 9 మంది సైనికులు, పౌరులు చనిపోయినట్లు నిర్ధరణ అయింది. అయితే.. భారత్, పాకిస్థాన్ ప్రత్యారోపణలు గుప్పించుకున్నాయి. ప్రత్యర్థి దేశానికే ఎక్కువ నష్టం వాటిల్లిందని పరస్పరం వాదించుకున్నాయి.
ఇదీ చూడండి:భారత సైన్యం ప్రతీకారం- ఐదుగురు పాక్ జవాన్లు హతం!
దీనిపై భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రకటన కూడా చేశారు. ఆరు నుంచి పది మంది పాక్ సైనికులు మరణించారని.. మరో మూడు ఉగ్ర శిబిరాల్ని ధ్వంసం చేసినట్లు స్పష్టం చేశారు. అయితే... వెంటనే బదులిచ్చిన పాక్ సైనిక మీడియా భారత వాదనల్ని తోసిపుచ్చింది. ఎప్పట్లాగే బుకాయించి... కట్టుకథలు అల్లింది. 9 మంది భారత భద్రతా సిబ్బందే ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది. భారత్‌కే ఎక్కువ నష్టం జరిగిందని చెప్పుకొచ్చింది.
వీడియోలు సృష్టించి తప్పుదోవ...
భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన అనంతరం ప్రతిసారీ ఇలాంటి మాటల యుద్ధమే జరుగుతుంది. సైనికులను తరిమికొట్టి, శిబిరాల్ని ధ్వంసం చేసినట్టుండే నకిలీ వీడియోలు ట్విట్టర్లో దర్శనమిస్తాయి. కానీ ఇలాంటివి... నియంత్రణ రేఖ వద్ద జరుగుతున్న సంఘర్షణకు సంబంధించిన వాస్తవాలను ఏమాత్రం ప్రతిబింబించవు.
అలా మొదలు...
నియంత్రణ రేఖ వెంట దశాబ్దానికిపైగా సాగిన పరస్పర దాడుల అనంతరం... 2003లో ఇరు దేశాలు కాల్పుల విరమణపై ఓ ఒప్పందాన్ని చేసుకున్నాయి. తదనంతరం దాదాపు పదేళ్ల వరకు సరిహద్దు ప్రాంతం బాగానే ఉంది. అక్కడి ప్రజలు పెద్దగా తుపాకుల శబ్దాలు లేకుండా కొంతకాలం ప్రశాంతంగానే జీవించారు. ప్రత్యేకంగా పౌరుల గురించే ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే ఏ కాల్పుల విరమణలోనైనా ఎక్కువగా బాధపడేది వారే. ఇంకా వారికి తగిన రక్షణా ఉండదు. 2018 మేలో పాకిస్థాన్ దాడి నుంచి తప్పించుకోవడానికి ఆర్నియా సెక్టార్‌లోని దాదాపు 76 వేల మందికిపైగా గ్రామస్థులు తమ నివాసాలను వదిలివెళ్లాల్సి వచ్చింది. సరిహద్దుకు ఆవలా ఇవే పరిస్థితులు కనిపించాయి.
2013లోనే మారిన పరిస్థితులు...
నా దృష్టిలో 2013లోనే పరిణామాలన్నీ ఒక్కసారిగా పూర్తిగా మారిపోయాయి. ఎందుకంటే... కశ్మీర్‌వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేయడాన్ని, భారత్‌కు సన్నిహితంగా మెలిగే నవాజ్ షరీఫ్ పాక్ ఎన్నికల్లో గెలుపొందడాన్ని... అక్కడి సైన్యం జీర్ణించుకోలేకపోయింది. ఇది వారికి అసౌకర్యం కలిగించింది. ఇదే మళ్లీ ఉద్రిక్తతలకు కారణమైందని నా అభిప్రాయం. పాక్ సైన్యం... కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలను తీవ్రతరం చేసింది. హీరానగర్, సాంబా, జంగ్లోటేలోని భద్రతా దళాలపై దాడులకు పాల్పడింది.