ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహహమ్మారి కరోనా. ఇప్పుడు భారత్‌లోనూ అడుగుమోపింది. ఈ తరుణంలో ప్రజలంతా తీవ్ర భయాందోళన చెందుతున్నారు. మరి వైరస్‌పై పోరాడేందుకు తీసుకోవాల్సిన చర్యలేమిటి?. అసలు కరోనా ఎక్కువగా ఎవరికి సోకుతుంది? లక్షణాలేంటో ఓ సారి తెలుసుకొని జాగ్రత్త పడదాం.
ఎవరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి?
ఇంతవరకు నిర్ధారణ అయిన కేసులను పరిశీలిస్తే.. రెండు రకాల వ్యక్తుల్లో కరోనా ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మొదటి రకం వ్యక్తులు- 60 ఏళ్లు పైబడిన వృద్ధులు. రెండో రకం వారు- బీపీ, మధుమేహం, గుండెజబ్బులు, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారితోపాటు క్యాన్సర్ రోగులు. ఈ రెండు రకాల వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. కొవిడ్ వచ్చే ముప్పు 40 ఏళ్ల నుంచి పైబడిన వయసు వారిలో క్రమేపీ ఎక్కువగా ఉంటున్నట్లు ఇంతవరకు నమోదైన కేసుల ద్వారా తెలుస్తోంది.
ఆ ప్రాంతాలకు వెళితే ఏంచేయాలి?
ఇటీవల కొవిడ్ ప్రబలిన ప్రాంతాలకు వెళ్లి వచ్చినవారు; అలా వెళ్లివచ్చినవారిని కలిసిన వారు; అలాంటి చోట్ల నివసిస్తున్నవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఒంట్లో ఏమాత్రం నలతగా ఉన్నా, కనీస రోగ లక్షణాలు కనిపించినా తగ్గేవరకూ ఇళ్లలోనే ఉండిపోవాలి. క్రమేపీ రోగ లక్షణాలు పెరుగుతున్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వైద్యులకు తాము ఇటీవల ఎక్కడకు వెళ్లిందీ? లేదా ఎక్కడికైనా వెళ్లి వచ్చినవారిని కలిసిందీ వివరంగా తెలియజెప్పాలి.
కొవిడ్-19 రోగ లక్షణాలేమిటి?
సాధారణంగా జ్వరం, అలసట, పొడి దగ్గు, శ్వాసలో ఇబ్బందులు ఉంటాయి. కొందరిలో తలనొప్పి, ఇతర నొప్పులు, ముక్కు దిబ్బడ.. ముక్కులు కారడం, గొంతులో మంట లేదా డయేరియా లక్షణాలు ఉండొచ్చు. ప్రారంభంలో ఈ లక్షణాలు తక్కువగా ఉండి క్రమేపీ పెరుగుతాయి. కొందరికి కరోనా సోకినప్పటికీ ఈ లక్షణాలేవీ కనిపించవు. అనారోగ్యంగా కూడా అనిపించదు. వైరస్ సోకిన వారిలో 80 శాతం మందికి ప్రత్యేక చికిత్స లేకుండా తగ్గిపోతుంది. ఎవరికైనా జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి.